ర‌క్తి క‌ట్టించ‌ని బాబు షో

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి నాట‌కాలు దాగ‌డం లేదు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా టీడీపీ విఫ‌ల‌మైన విష‌యాన్ని టీడీపీ మిత్ర‌ప‌క్షం, తెలంగాణ ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ త‌న కార్యాచ‌ర‌ణ‌తో లోకానికి చాటి…

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి నాట‌కాలు దాగ‌డం లేదు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా టీడీపీ విఫ‌ల‌మైన విష‌యాన్ని టీడీపీ మిత్ర‌ప‌క్షం, తెలంగాణ ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ త‌న కార్యాచ‌ర‌ణ‌తో లోకానికి చాటి చెప్పింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత‌….ప్ర‌తి అంశంలోనూ పోల్చి చూడ‌డం ప‌రిపాటైంది.

ముఖ్యంగా క‌రోనాను ఎదుర్కోవ‌డంలో తెలంగాణ స‌ర్కార్‌తో పోల్చితే ఏపీ స‌ర్కార్ బ్ర‌హ్మాండంగా చేస్తోంద‌నే అభిప్రాయాలు తెలంగాణ ప్ర‌తిప‌క్షాలే చెబుతున్నాయి. తెలంగాణ మీడియా కూడా ఈ విష‌య‌మై కోడై కూస్తోంది. ఇక ప్ర‌జాప‌క్షం వ‌హిస్తూ….క్షేత్ర‌స్థాయిలో క‌రోనాకు అందుతున్న సేవ‌ల్లోని లోపాల‌ను ఎప్పిక‌ప్పుడు ఎత్తి చూపుతూ ప్ర‌భుత్వాన్ని అప్ర‌మ‌త్తం చేయాల్సిన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌నాయుడు…ఆ ప‌ని మానేసి, తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌లో త‌మ ఇంట్లో సేద‌దీరుతున్నారు.

పైగా ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫ‌రెన్స్‌ల‌తో కాలం గడుపుతున్నారు. కానీ తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీలు బీజేపీ, వామ‌ప‌క్షాలు త‌మ వంతు పాత్ర‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఏపీ, తెలంగాణ ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌నితీరును చాటే రెండు ఉదంతాల గురించి చెప్పుకుందాం.

రెండురోజుల క్రితం చంద్ర‌బాబునాయుడు హైద‌రాబాద్ విడిచి ఉండ‌వ‌ల్లికి వెళ్లారు. జైలు నుంచి విడుద‌లైన త‌న పార్టీ ముఖ్య నేత‌లైన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు ర‌వీంద్ర‌ల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఆ త‌ర్వాత  “క‌రోనాపై క‌లిసి పోరా డదాం” అనే నినాదంతో వైద్యులు, క‌రోనాతో పోరాడి బ‌య‌ట‌ప‌డ్డ వారు, సేవా కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకుంటున్న వారితో గురువారం చంద్ర‌బాబు ఆన్‌లైన్‌లో చ‌ర్చా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ స‌మావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ వైసీపీ ప్ర‌భుత్వం మొద‌టి నుంచి క‌రోనాను త‌క్కువ అంచ‌నా వేసింద‌ని, అధికారంలో ఉన్న‌వారే పారాసిట‌మాల్‌, బ్లీచింగ్ పౌడ‌ర్ చ‌ల్లాల‌ని, తేలిగ్గా మాట్లాడే స‌రికి ప్ర‌జ‌లు నిజ‌మ‌నుకున్నార‌ని  విమ‌ర్శించారు. క‌రోనా నియంత్ర‌ణ‌లో ప్ర‌భుత్వం చేతులెత్తేసింద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. 

దేశంలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న మొద‌టి 30 జిల్లాల్లో 12 ఏపీవే. వైర‌స్ నియంత్ర‌ణ‌లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌నం ఇదే అని అన్నారు. ఇంకా జ‌గ‌న్ స‌ర్కార్‌పై బాబు అనేక విమ‌ర్శ‌లు చేశారు.

తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ ఏం చేసిందో ఒక‌సారి తెలుసుకుందాం. సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క నేతృత్వం లో ఓ బృందం గురువారం మేడ్చల్‌ జిల్లా ఆస్పత్రిని, యాదాద్రి-భువనగిరి జిల్లాలోని ఆస్పత్రిని ప‌రిశీలించింది. ఈ సంద‌ర్భంగా మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ   ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అతిపెద్ద నేర‌స్తుడ‌ని విమ‌ర్శించారు.

రాష్ట్రంలో ప్రతి కరోనా మృతి సర్కారు హత్యగానే భావించాలని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్‌ అసమర్థ నిర్ణయాల వల్లే రాష్ట్రలో పాజిటివ్‌ల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని మండిప‌డ్డారు.  ప్రభుత్వం ఇప్పటికైనా హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలని ఆయ‌న‌ కోరారు.

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీ నేరుగా ఆస్ప‌త్రుల‌ను సంద‌ర్శిస్తూ క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు తెలుసుకుని విమ‌ర్శ‌లు చేస్తోంది. అలాగే బాధితుల‌కు తామున్నామ‌నే భ‌రోసా క‌ల్పించే య‌త్నం చేయ‌డాన్ని మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ప‌ర్య‌ట‌న ద్వారా తెలుసుకున్నాం. కానీ ఏపీలో మాత్రం చంద్ర‌బాబు త‌న ఇంట్లో కూర్చొని ప్ర‌చారం కోసం తంటాలు ప‌డుతుండడాన్ని చూడొచ్చు.

బాబుకు కావాల్సింది రాజ‌కీయాలే త‌ప్ప‌….ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు కాద‌నే ఇదే ఉదంతం. ఏపీలో ఒక ప్ర‌తిప‌క్ష పార్టీగా టీడీపీ, నాయ‌కుడిగా చంద్ర‌బాబు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యార‌నేందుకు ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి?

భగవద్గీత వల్లిస్తే చాలదు.. బాణం పట్టాలి

వీడు అక్కయ్య వాడు అన్నయ్య