లేడీ అమితాబ్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా వేస్తున్న ప్రశ్నలు కొందరిలో అశాంతి రేకెత్తిస్తున్నాయి. మహిళల కోణంలో ఆమె రైజ్ చేస్తున్న అంశాలు చాలా విలువైనవి, కీలకమైనవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విజయశాంతి ప్రస్తావిస్తున్న అంశాల కోణంలో…ఇంత వరకూ ఏ సినీ సెలబ్రిటీ ఆలోచించకపోవడం గమనార్హం.
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. సీబీఐ దర్యాప్తుతో పాటు సుశాంత్ మృతికి కారకులెవరనే విషయమై ఇటు సోషల్ మీడియా, అటు మెయిన్‌స్ట్రీమ్ మీడియాలోనూ విస్తృత జరుగుతుండడాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో లేడీ అమితాబ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పవర్సన్ సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్లో సృజనాత్మకంగా, విమర్శనాత్మకంగా స్పందించారు.
‘సుశాంత్ ఆత్మహత్య కేసులో దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు ఆదేశించడం సంతోషదాయకమే. కానీ, మన సినీ రంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో ఎంతో మంది నటీమణులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషయాలు మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు, దర్యాప్తులు జరిగాయా? చాలా మంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశాం.
సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి’ అని విజయశాంతి అన్నారు.
ఇంకా అనేక అంశాలను ఆమె ప్రస్తావించారు. కానీ విజయశాంతి ప్రశ్నిస్తున్నట్టుగా….నటీమణుల ఆత్మహత్యలపై ఇలాంటి విచారణలు జరిగినట్టు ఇంత వరకూ ఎప్పుడూ వినలేదు, కనలేదు. ఎందుకిలా? నటీమణుల ఆత్మహత్యలనగానే…ఆమె క్యారెక్టర్‌పై నెగటివ్ ముద్ర వేసి…అలాంటి వారికి మరెవరూ మద్దతు పలకకుండా మీడియాను అడ్డుపెట్టుకుని చేసిన ఉదంతాలు అనేకం. విజయశాంతి లేవనెత్తిన అంశాల ప్రాతిపదికపై సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.