అచ్చెన్నాయుడికి ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించబోతున్నారంటూ.. రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నేరుగా పార్టీ వర్గాలు స్పందించకుండా.. తమ అనుకూల మీడియా ద్వారా ఫీలర్లు బైటకు వదిలారు. అసలు టీడీపీ అంటే చంద్రబాబే గుర్తొస్తారు కానీ, దానికి ఏపీలో ఒక అధ్యక్షుడు, తెలంగాణలో మరో అధ్యక్షుడు ఉన్నారని ఎంతమందికి గుర్తు. కళా వెంకట్రావు ఏపీలో టీడీపీ అధ్యక్షుడిగా ఇప్పటి వరకూ ఏంచేశారు?
కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ గా ఎవరు ఉన్నా, ఆ పార్టీకి సంబంధించి ప్రధాని ఎవరైనా పగ్గాలు మాత్రం సోనియాగాంధీ చేతుల్లోనే ఉంటాయని అందరికీ తెలుసు. టీడీపీలో కూడా అదే పరిస్థితి. రాష్ట్రాల పగ్గాలు ఎవరికిచ్చినా చంద్రబాబుని దాటి వెళ్తారా? అంతమాత్రానికి పార్టీ అధ్యక్షుడు అనే పేరు ఎందుకు? దాన్ని అచ్చెన్నాయుడికి ఇవ్వబోతున్నట్టు ఫీలర్లు వదలడం ఎందుకు?
అచ్చెన్నకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అంటే, గతంలో వర్ల రామయ్యను రాజ్యసభకి పోటీపెట్టిన లాంటిదే. అక్కడ సీటు దక్కదని తెలిసినా కూడా వర్లను బరిలో నిలిపి బకరా చేశారు బాబు, ఇక్కడ అధికారాల్లేని పోస్టు అచ్చెన్నకు ఇస్తామంటూ మరో బిస్కెట్ రెడీ చేస్తున్నారు. ఈ పదవీ యోగం అచ్చెన్నను ఫూల్ చేయడానికా లేక, ఆయన అన్నకొడుకు రామ్మోహన నాయుడిని కూల్ చేయడానికా అనే అనుమానం కూడా ఉంది.
గతంలో రామ్మోహన నాయుడికి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ఉత్తరాంధ్రలో కలకలం రేగింది. దీంతో లోకేష్ సర్దుకున్నారు. రామ్మోహన్ నాయుడితోనే సంజాయిషీ ఇప్పించారు. ఇప్పుడా పదవి అచ్చెన్నకు ఇస్తే అసలు సమస్యే ఉండదు కదా అనేది లోకేష్ ఆలోచన. పోనీ జైలుకి వెళ్లిరావడమే ప్రధాన అర్హత అయితే అచ్చెన్న స్థానంలో ఆ పదవిని జేసీ సోదరుల్లో ఒకరికి ఇవ్వొచ్చు కదా అనే లాజిక్ తీస్తున్నారు కొంతమంది.
దివాకర్ రెడ్డికి కానీ, ప్రభాకర్ రెడ్డికి కానీ టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ము చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అచ్చెన్ననో, బుచ్చయ్యనో చేతిలో పెట్టుకుని ఆడించాలనుకుంటారు కాబట్టే.. ఇలా పదవుల పందేరం చేస్తున్నారు. బీసీలపై ప్రేమ ఉన్నట్టు, ఉత్తరాంధ్రులకు న్యాయం చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. ఈ పచ్చ రాజకీయం తెలియనిది ఎవరికి?