అయ్యన్నపాత్రుడు…సీనియర్ మోస్ట్ టీడీపీ లీడర్, గట్టిగా చెప్పాలంటే చంద్రబాబు కంటే కూడా టీడీపీలో సీనియర్. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. పెళ్ళి కాకుండానే చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అనుభవం.
దాదాపుగా పది పన్నెడు మంత్రిత్వ శాఖలను నిర్వహించి పలుమార్లు మంత్రిగా పనిచేసిన సీనియర్లలో అయ్యన్న ముందు వరసలో ఉంటారు. అటువంటి అయ్యన్నపాత్రుడు టీడీపీకే అంకితం అయ్యారు. పక్క పార్టీ వైపు కన్నెతి చూసిన దాఖలాలు అసలు లేవు.పార్టీ పట్ల అంకితభావం విషయంలో ఆయన తరువాతే ఎవరైనా అని కూడా చెప్పుకోవాలి. మరి అయ్యన్న సీనియారిటీకి టీడీపీలో చంద్రబాబు ఇస్తున్న విలువ ఏంటి అన్న ప్రశ్న వేసుకుంటే నీరసమైన జవాబే వస్తుంది.
టీడీపీ అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రా జిల్లాలకు న్యాయం చేయాలన్నద్యాస బాబుకు రాలేదు. బీసీల పార్టీ అని చెప్పుకునే బాబు అయ్యన్న వంటి వారిని కనీసం ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని ఏనాడూ ఆలోచన చేయలేదు.
ఇక ఇపుడు చూస్తే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని అచ్చెన్నాయుడుకి ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన కంటే ముందు వరసలో ఉన్నా కూడా అయ్యన్న పేరే బాబు పరిశీలించడంలేదుట. ఇక అచ్చెన్న కంటే ముందు కిమిడి కళా వెంకటరావుకు కిరీటం పెట్టారు. ప్రజారాజ్యం పార్టీలో చేరి టీడీపీని మధ్యలో వీడిపోయిన కళాను కూడా అయ్యన్న కంటే ముందే బాబు ఉంచారు.
ఇపుడు తనకంటే జూనియర్ అయిన అచ్చెన్నాయుడికే ఆ పదవి కట్టబెట్టాలనుకుంటున్నారు. అయ్యన్న తెల్లారిలేస్తే జగన్ని తెగనాడుతూ తెగ ఆయాసపడుతూంటారు. తానే అందరికంటే గొప్ప అంటారు. కానీ లాభమేంటి, ఆయాసమే తప్ప అయ్యన్నకు పదవుల విషయంలో అన్యాయమే జరుగుతోందని అనుచరులు బాధపడితే అర్ధముందిగా.