చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతానికి గురై మరణించిన ముగ్గురు యువకులకు 12.5 లక్షల రూపాయల పరిహారాన్ని అందించనున్నట్టుగా జనసేన ప్రకటించింది. మరణించిన వారి కుటుంబానికి ఈ సొమ్ము ఆసరాగా ఉంటుంది. ఇది అభినందించదగిన విషయమే. అనాలోచితమైన చర్యతో ప్రాణాలు కోల్పోయిన యువకుల కుటుంబాల బాధను ఈ డబ్బు తగ్గించకపోయినా, ఈ డబ్బుతో ఆ కుటుంబాలకు అయినా అండగా నిలుస్తున్నారు. ఇది అభినందనీమయైన చర్య.
ఇందుకు సంబంధించి జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. అక్కడి వరకూ బాగానే ఉన్నా, ఈ డబ్బు ఎవరిస్తున్నారు? అనే అంశం గురించి జనసేన వివరించిన తీరే కంగాళీగా ఉంది! సినీ నిర్మాతలు ఈ డబ్బును ఇస్తున్నారట.
పవన్ కల్యాణ్, ఇతర మెగా హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలు మృతుల కుటుంబాలకు 12.5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందిస్తాయట. ఇది వరకూ సినీ నిర్మాతల చేత హీరోలు రకరకాలుగా ఖర్చులు పెట్టిస్తాయనే వార్తలు వచ్చేవి. ఆ మధ్య ఒక స్టార్ హీరో సినిమా నిర్మాణ సందర్భంగా తన కుటుంబ ఫారెన్ టూర్ కు కూడా ఆ నిర్మాతతోనే ఖర్చులు పెట్టించాడని వార్తలు వచ్చాయి. అదో రకమైన విషయం. ఇది మరో రకం. అభిమానులకు సాయం చేసిన పేరు హీరోకి, అతడి రాజకీయ పార్టీకి, డబ్బులు వారితో సినిమాలు నిర్మించే వాళ్ల అకౌంట్ నుంచి! ఏం ప్లాన్ వేశారు!