ఒట్టు తీసి గ‌ట్టున పెట్టి….మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా?

మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టీవ్ అవుతార‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. ల‌గ‌డ‌పాటి ముఖ్య అనుచ‌రులు కొంద‌రు బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని ఒక హోట‌ల్‌లో స‌మావేశం కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ల‌గ‌డ‌పాటిని రాజ‌కీయాల్లోకి…

మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టీవ్ అవుతార‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. ల‌గ‌డ‌పాటి ముఖ్య అనుచ‌రులు కొంద‌రు బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని ఒక హోట‌ల్‌లో స‌మావేశం కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ల‌గ‌డ‌పాటిని రాజ‌కీయాల్లోకి తిరిగి ఆహ్వానిస్తూ భారీగా ఆత్మీయ స‌మావేశాలు నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

2014లో రాష్ట్ర విభ‌జ‌న ల‌గ‌డ‌పాటి రాజ‌కీయ జీవితానికి స‌మాధి క‌ట్టింది. అప్ప‌ట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించిన కాంగ్రెస్ ఎంపీగా ల‌గ‌డ‌పాటి గుర్తింపు పొందారు. ఏపీ విభ‌జ‌న బిల్లు లోక్‌స‌భ‌లో ఆమోదానికి వ‌చ్చిన సంద‌ర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీల మ‌ధ్య భౌతిక‌దాడులు చోటు చేసుకున్నాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ లోక్‌స‌భ స‌భ్యుల‌పై ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అత్యున్న‌త చ‌ట్ట‌సభ‌లో పెప్ప‌ర్ స్ప్రే కొట్టడం సంచ‌ల‌నం రేకెత్తించింది.

2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగితే రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతాన‌ని ల‌గ‌డ‌పాటి అప్ప‌ట్లో సంచ‌ల‌న ప్ర‌తిజ్ఞ చేశారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌డంతో ఆయ‌న త‌న మాట‌కు క‌ట్టుబ‌డి రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. అయితే త‌న‌కిష్ట‌మైన ఎన్నిక‌లు స‌ర్వేలు మాత్రం కొన‌సాగించారు. 

అయితే 2019లో ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ల‌గ‌డ‌పాటి అంచ‌నాలు త‌ప్పాయి. మ‌ళ్లీ చంద్ర‌బాబుదే అధికారం అని ఆయ‌న స‌ర్వే చెప్పింది. ఇందుకు విరుద్ధంగా వైసీపీ ఘ‌న విజ‌యం సాధించారు. దీంతో ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోవ‌డంలో ఫెయిల్ అయ్యానని ఆయ‌న అంగీక‌రిస్తూ ఇక‌పై స‌ర్వేలు కూడా చేయ‌న‌ని చెప్పారు.

అంత వ‌ర‌కూ ల‌గ‌డ‌పాటి స‌ర్వే అంటే చాలా వ‌ర‌కూ విశ్వ‌స‌నీయ‌త వుండేది. దాన్ని వైసీపీ దెబ్బ‌తీసింది. దీంతో పూర్తిస్థాయిలో రాజ‌కీయాలకు దూరంగా వుంటూ వ‌స్తున్నారు. తాజాగా విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో బ‌ల‌మైన నాయ‌క‌త్వం అవ‌స‌రం ఏర్ప‌డింది. తిరిగి రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌ని, అది కూడా ప్ర‌జ‌ల డిమాండ్ మేర‌కు వ‌చ్చిన‌ట్టు ఉండాల‌నే వ్యూహంతో ల‌గ‌డ‌పాటి అనుచ‌రులు ఆత్మీయ స‌మావేశాల‌కు తెర‌లేపుతున్నార‌ని స‌మాచారం.  

అయితే ఫ‌లానా పార్టీలో చేరాల‌ని కాకుండా, రాజ‌కీయాల్లోకి రావాల‌ని ల‌గ‌డ‌పాటిపై ముఖ్య అనుచ‌రులు ఒత్తిడి చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ల‌గ‌డ‌పాటి ఒట్టు తీసి గ‌ట్టున పెట్టి రాజ‌కీయాల్లోకి తిరిగి వ‌స్తారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ల‌గ‌డ‌పాటి నిర్ణ‌యం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.