'యధా రాజా…తథా ప్రజా' అనే ఆర్యోక్తి అందరికీ తెలిసిందే. రాజు ఎలా ఉంటాడో ప్రజలూ అలాగే ఉంటారని అన్నారు పెద్దలు. అంటే రాజు అనేవాడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని అర్థం. రాజు అనేవాడు కొన్ని విలువలకు, కొన్ని విధానాలకు కట్టుబడి ఉండాలి.
ప్రజలను పాలించే రాజుగారే అన్నీ వదిలేసి విచ్చలవిడిగా వ్యవహరిస్తే ముందు తరాలు ఆయన్ని గుర్తుంచుకోవడానికి ఏముంటుంది? ఈ మంచి మాట చెప్పింది ఎప్పుడో రాజుల కాలంలో. మరి అదిప్పుడు ఈ ప్రజాస్వామ్య రాజకీయాల్లో, పాలనలో వర్తిస్తుందా? అనే డౌటు ఉండొచ్చు. ఈ రాజకీయాలకు అది సరిపోతుందా? అనుకోవచ్చు. సార్వజనీనమైన విలువలు ఎప్పటికీ వర్తిస్తాయి. కాకపోతే పాలకులు వాటిని ఆచరించడంలోనే ఉంటుందంతా.
ఇప్పుడు రాజు అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేంద్రంలో ప్రధాని. వాళ్ల విధానాలు ఉత్తమంగా ఉంటే సభాపతులు అంటే స్పీకర్లు కూడా వాటినే అనుసరిస్తారు. ప్రభుత్వం ఏర్పడగానే స్పీకరును ఎంపిక చేసేది అధికార పార్టీయే.
ఈ విషయంలో ముఖ్యమంత్రి మాటే చెల్లుబాటవుతుంది. రాజ్యాంగం ప్రకారం స్పీకరు స్వతంత్రంగా వ్యవహరించాలి. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి ఒత్తిళ్లకూ, చివరకు ముఖ్యమంత్రి ఒత్తిళ్లకు కూడా లొంగకూడదు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కాని ఇలా జరుగుతోందా? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో జరిగిందేమో.
కాలక్రమంలో స్పీకర్ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టింది. ముఖ్యమంత్రుల కనుసన్నల్లో స్పీకర్లు పనిచేస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా వీరు నడుచుకుంటున్నారు. సీఎం ఏం చేయమంటే స్పీకర్ అది చేస్తున్నాడు. ఉమ్మడి ఏపీలో, ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ల పాత్ర చూస్తున్నాం.
ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడా, ఇటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు ఎలా విచ్చలవిడిగా జరిగాయో, దాంట్లో స్పీకర్లు నిర్వహించిన పాత్ర ఏమిటో చూశాం.
చంద్రబాబు హయాంలో కోడెల శివప్రసాదరావు, కేసీఆర్ మొదటి టర్మ్‌లో మధుసూదనాచారి స్పీకర్లుగా పనిచేశారు. వీరిద్దరూ ముఖ్యమంత్రులకు అనుగుణంగానే ఉండి, వారి ఆలోచనల ప్రకారమే పనిచేశారు. కోడెల స్పీకరుగా కాకుండా టీడీపీ నాయకుడిగానే వ్యవహరించారు.
టీడీపీ, వైకాపా సాగించిన రాజకీయ క్రీడకు అతీతంగా వ్యవహరించాల్సిన కోడెల టీడీపీ మనిషిగానే వ్యవహరించారు. టీడీపీ నిర్వహించిన పలు నిరసన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. గౌరవనీయమైన స్థానంలో ఉన్న స్పీకర్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.
కోడెల వంటి స్పీకర్లు ఎందరో ఉన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక స్పీకరైన ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారాంకు సౌమ్యుడిగా పేరుంది. కాని ఈయన కూడా రాజకీయాలకు అతీతంగా ఏమీ లేరు. జగన్‌ను పొగుడుతూ, టీడీపీని విమర్శస్తూ ఉంటారు. ఆయన స్పీకర్ స్థానంలో ఉండి కూడా ఈ ధోరణికి అతీతంగా ఉండలేకపోతున్నారు.
ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలే అయింది కాబట్టి ముందు ముందు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. కొన్ని రోజులుగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పైన వీరంగం వేస్తున్నాడు.
అయ్యప్ప దీక్షలో ఉన్న వంశీ దీక్ష ఎంత నిష్టగా చేస్తున్నాడో తెలియదుగాని టీడీపీ మీద మాత్రం తీవ్ర విమర్శలను నిష్టగా చేస్తున్నాడు. వంశీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఇతను వైకాపాలో చేరతాడనేది ఓపెన్ సీక్రెట్. పదవులు లేని టీడీపీ నేతలు పలువురు వైకాపాలో చేరారు. వారితో ప్రాబ్లెం లేదు.
కాని వంశీ ఎమ్మెల్యే కదా. అందుకే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి వైకాపాలోకి రావాలని తమ్మినేని ఖరాఖండిగా చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఏ పార్టీలోకి వెళ్లినా వేటు వేస్తానన్నారు. ఇప్పటివరకు ఏ స్పీకరూ ఇలా చెప్పలేదు. ఇందుకు కారణంగా ముఖ్యమంత్రి జగన్ పెట్టుకున్న విధానం.
పదవి వదులుకొని పార్టీ మారాలని, ఇదే విధానమని ఎప్పటినుంచో చెబుతున్నారు. 'పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలుంటాయి. ముఖ్యమంత్రి జగన్ కూడా గతంలో ఇదే చెప్పారు. ఆ విధానానికే కట్టుబడి ఉన్నాం' అన్నారు తమ్మినేని. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే…జగన్ ఆల్రెడీ ఒక విధానం ప్రకటించారు కాబట్టి దాన్ని తమ్మినేని ఫాలో అవుతున్నారు. రిజైన్ చేయకుండా పార్టీలో చేర్చుకునే విధానం పెట్టుకుంటే స్పీకర్ దాన్ని ఫాలో అయ్యేవాడు. సీఎం ఎలా ఉంటే స్పీకర్ అలా ఉంటాడు.