అలా చేస్తే క‌రోనాను 99 శాతం క‌ట్ట‌డి చేయొచ్చు!

ఇండియాలోకి క‌రోనా ప్ర‌వేశించి ఆరు నెల‌లు గ‌డిచిపోయాయి. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా కేసుల సంఖ్య ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతోంది. మార్చి నెల‌లో ఎక్క‌డైనా ఒక్క‌రికి క‌రోనా అంటేనే భ‌య‌ప‌డిన ద‌శ నుంచి, రోజుకు వెయ్యి మంది…

ఇండియాలోకి క‌రోనా ప్ర‌వేశించి ఆరు నెల‌లు గ‌డిచిపోయాయి. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా కేసుల సంఖ్య ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతోంది. మార్చి నెల‌లో ఎక్క‌డైనా ఒక్క‌రికి క‌రోనా అంటేనే భ‌య‌ప‌డిన ద‌శ నుంచి, రోజుకు వెయ్యి మంది క‌రోనాతో మ‌ర‌ణించే ద‌శ‌కు వ‌చ్చింది భార‌త దేశం. 

ఒక‌వైపు అంత‌ర్జాతీయంగా వివిధ దేశాల్లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇండియాలో మాత్రం కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతూ ఉంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటంటే.. భౌతికదూరాలు స‌రిగా పాటించ‌క‌పోవ‌డ‌మే అని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు.

క‌రోనా వ్యాప్తికి ప్ర‌ధాన కార‌ణం ఇదే అని తేల్చి చెబుతున్నారు. అలాగ‌ని భౌతిక దూరాలు పాటించ‌డానికి లాక్ డౌన్లు పెట్ట‌డ‌మో, పోలీసుల‌తో కొట్టించ‌డ‌మో కూడా ప‌రిష్కార మార్గం కాద‌ని స్ప‌ష్టం అవుతోంది. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెర‌గాలి! రోజుకు వెయ్యి మంది క‌రోనా కార‌ణంగా చ‌నిపోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నా.. ఇంకా మాస్క్ ల‌ను పెట్టుకోవ‌డానికి, మ‌నిషికి కాస్త దూరంగా నిల‌బ‌డ‌టానికి జ‌నాలు ఆస‌క్తి చూప‌డం లేదంటే.. క‌రోనా ఎప్ప‌టికి కంట్రోల్ అవుతుందనే సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు!

వ‌స్తువుల నుంచినో, గాలి ద్వారానో క‌రోనా వ్యాప్తి అంత‌గా జ‌ర‌గ‌డం లేద‌ని వైద్యులు, నిపుణులు అంటున్నారు. ఒక మ‌నిషితో మ‌రో మ‌నిషి మాట్లాడేట‌ప్పుడు వెలువ‌డే తుంప‌ర్ల ద్వారానే క‌రోనా ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతోంద‌ని వారు స్ప‌ష్టం చేస్తున్నారు. మాస్క్ లు ధ‌రించ‌డం ద్వారా ఈ త‌ర‌హాలో వ్యాప్తిని నియంత్రించ‌వ‌చ్చు అని కూడా స్ప‌ష్టం చేస్తున్నారు. అంటే అంతా స్ట్రిక్ట్ గా  మాస్కులు ధ‌రిస్తే.. ప్ర‌స్తుతం రోజువారీగా న‌మోద‌వుతున్న కేసుల్లో  చాలా వ‌ర‌కూ త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది. 

ఎవ‌రి ప‌నులు వారు చేసుకోవ‌చ్చ‌ని, లాక్ డౌన్లు అవ‌స‌రం లేద‌ని… మాస్క్ ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించ‌డం ద్వారా లాక్ డౌన్ ను పాటించినంత ఉప‌యోగం ఉంటుంద‌ని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కోట్ల రూపాయ‌ల న‌ష్టాల‌ను క‌లిగించే లాక్ డౌన్ల క‌న్నా.. ప్ర‌జ‌లు నిర్భంధంగా మాస్క్ లు ధ‌రిస్తే ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంత‌కీ గ్రౌండ్ లెవ‌ల్లో ప‌రిస్థితి ఏమిటి? అంటే.. భ‌యం ఉన్న వాళ్లు, ఆస‌క్తి ఉన్న వాళ్లు మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు. క‌రోనా త‌మ‌ను ఏం చేయ‌లేద‌నే అతి విశ్వాసం ఉన్న వాళ్లు మాస్క్ ల విష‌యం ప‌ట్ట‌న‌ట్టుగా తిరుగుతున్నారు.

మాస్క్, భౌతిక దూరాన్ని పాటించ‌డం ద్వారా.. 99 శాతం వ‌ర‌కూ క‌రోనా క‌ట్ట‌డి అవుతుంద‌ని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. చాలా మంది బ‌య‌ట నుంచి వ‌స్తువుల‌ను ఇంటికి తీసుకెళ్ల‌డానికి చాలా ఆలోచిస్తున్నార‌ని, వాటి విష‌యంలో 99 శాతం శ్ర‌ద్ద‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, కానీ వాటి ద్వారా క‌రోనా ఛాన్సెస్ ఒక్క శాత‌మే అని, అదే 99 శాతం క‌రోనా వ్యాప్తికి కార‌ణం అయిన భౌతిక దూరం విష‌యంలో మాత్రం జ‌నాలు ఇప్ప‌టికీ సీరియ‌స్ గా ఉండ‌టం లేద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితి ఎప్ప‌టికి మారాలి? 

భగవద్గీత వల్లిస్తే చాలదు.. బాణం పట్టాలి