‘అవును నేనే’ అనేస్తున్న నేతలు!

రాజకీయంగా ప్రత్యర్థుల మీద సోషల్ మీడియా వేదికల మీద బురద చల్లడం, ఆడియో కాల్ రికార్డింగులు లీక్ కావడం.. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. తాజా పరిణామాల్లో నాయకులు…

రాజకీయంగా ప్రత్యర్థుల మీద సోషల్ మీడియా వేదికల మీద బురద చల్లడం, ఆడియో కాల్ రికార్డింగులు లీక్ కావడం.. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. తాజా పరిణామాల్లో నాయకులు ‘అవును నేనే’ అంటూ తెగించి ప్రకటిస్తున్న పరిణామం కనిపిస్తోంది. ప్రత్యేకించి తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో.. తమ సోషల్ మీడియా పోస్టులను నేరంగా పరిగణించి అరెస్టు చేసినా కూడా.. ఆ అరెస్టులను రాజకీయ మైలేజీకి వాడుకోవచ్చునని అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ.. నాయకులు ఓపెన్ గా బయటపడిపోతున్నారు.

‘తెలంగాణ గళం’ పేరుతో ఫేస్ బుక్ పేజీ, యూట్యూబ్ చానెల్ ఉన్నాయి. తెరాసకు వ్యతిరేకంగా ఇందులో విపరీతంగా పోస్టులు పడుతుంటాయి. మీమ్స్ తయారవుతుంటాయి. ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ, కేసీఆర్ కేటీఆర్ కవిత తదితరుల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ అనేక మీమ్ లు పడుతుంటాయి. వీటిమీద రచ్చ రచ్చ అవుతోంది. ఈ చానెల్ పై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. 

కేసులో ప్రధాన నిందితుడు అయిన సునీల్ కనుగోలు అనే వ్యక్తిని విచారించారు. అయితే ఈ చానెల్ కాంగ్రెస్ నాయకుడు మల్లు రవికి సంబంధించినది అతను వాంగ్మూలం ఇవ్వడంతో రవిని కూడా పిలిపించారు. విచారణకు వచ్చిన మల్లు రవి.. ఎలాంటి శషబిషలు లేకుడా.. తెలంగాణ గళం యూట్యూబ్ చానెల్ తనదేనని, అందులో వచ్చే కంటెంట్ మొత్తానికి తనదే బాధ్యత అని పోలీసులకు చెప్పడం గమనార్హం.కాస్త చవకబారు తరహాలో విమర్శలు పెడుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా చానెల్ నాదే అని స్ట్రెయిట్ గా ఒప్పుకున్నారు మల్లు రవి. 

అలాంటిదే మరో సంఘటన కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆడియో లీక్ అయింది. పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా ఉండగా ఆయనకు పదికోట్ల రూపాయల కమిషన్ ఇప్పించానని కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఎవరితోనో ఫోన్ కాల్ లో అన్నట్టుగా ఒక ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చింది. పదికోట్ల రూపాయల లంచం వ్యవహారం కావడంతో సంచలనంగా మారింది. 

ఇలాంటివి జరిగినప్పుడు.. సదరు మాటలు అన్న వ్యక్తి.. అది నా స్వరం కాదని చెప్పేసి తప్పించుకోవడం సహజంగా జరుగుతుంటుంది. కానీ జంగా రాఘవరెడ్డి మాత్రం.. ఆ ఆడియోలో మాటలు తానుచెప్పినవేనని కన్ఫర్మ్ చేశారు. సో, కాంగ్రెస్ లో ఇది మరొక కొత్త అంతర్గత కుమ్ములాట అన్నమాట. పొన్నాల మంత్రిగా ఉండగా పదికోట్లు లంచం తీసుకున్నట్టు సొంత పార్టీ వాళ్లే చెబుతున్నారు. ఆ బురదను కడుక్కోవడం ఇక పొన్నాల వంతు!