జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తనను ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే ఉన్నాయి. తన మూడు పెళ్లిళ్లగురించి ప్రస్తావిస్తున్నారని ఆయన అంటూ, కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండని, తానేమి సరదాకు చేసుకోలేదని ఆయన అన్నారు. అంతేకాదు.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఈనాడు అదినేత రామోజీరావుల తరపున కూడా వకల్తా తీసుకుని ఆయన మాట్లాడారు. టిడిపి అదినేత చంద్రబాబు పక్షాన కూడా మాట్లాడేస్తే అది పరిపూర్ణం అయ్యేదేమో! నిజమే పవన్ కళ్యాణ్ చెబుతున్నట్లు ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదు. కాని పవన్ కళ్యాణ్ ఆ విషయంలో సంయమనంగా ఉన్నారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది.
ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి ఆయన చేస్తున్న విమర్శలు వ్యక్తిగతమైనవి కాకుండా ప్రభుత్వ విధానాలపై చేస్తున్నారా?అన్నది ఆయన ఆలోచించాలి. విశాఖలో లాంగ్ మార్చ్ పేరుతో జరిపిన షార్ట్ మార్చ్ లోకాని, ఆ తర్వాత కాని, ఆయన జగన్‌ను, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి ఎలా మాట్లాడారో అప్పుడే మర్చిపోయారా? నేను ఏమైనా అంటాను.. మీరు ఏమి మాట్లాడవద్దు అని అచ్చం చంద్రబాబు తీరులోనే పవన్ కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ గతంలో జైలులో ఉన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు ప్రస్తావించారు? రాజధానిని పులివెందుల తీసుకు వెళ్లండి. హైకోర్టు కర్నూలులో ఉంటే అక్కడ నుంచి వెళ్లడానికి దగ్గర అవుతుందని ఆయన ఎందుకు అనవలసి వచ్చింది.
రాయలసీమలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎందుకు నిరసన వ్యక్తం అయిది? జగన్ పై ఉన్న ద్వేషంతో పవన్ కళ్యాణ్ కూడా రాయలసీమ ప్రజలను అవమానించేలా మాట్లాడారని వారి ఆరోపణ. చంద్రబాబు అదే పనిచేస్తున్నారు. ఆయన మాట్లాడితే రాయలసీమ గూండాలని, కడప రౌడీలని, పులివెందుల పంచాయతీ అని మాట్లాడి ఆ ప్రాంత ప్రజలను నిత్యం అవమానిస్తుంటారు. దానికి కారణం ఆయనకు రాయలసీమ అంతా కలిపి ఏభైరెండు సీట్లకు గాను కేవలం మూడు సీట్లే ఇచ్చారన్న కోపం అన్నది బహిరంగ రహస్యమే. పవన్‌కు రాష్ట్రం అంతా కలిపి ఒక్క సీటే వచ్చింది. చివరికి ఆయనే రెండు చోట్ల ఓడిపోయారు. ఆ అసహనం సహజంగానే రావచ్చు. కాని అక్కడే ఆయన సమతుల్యంగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి.
జగన్‌ను జైలుకు వెళ్లారని పదే పదే అంటున్నారు. అది కరెక్టు అయినప్పుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంది నిజమే కదా.. ముఖ్యమంత్రిగా జగన్ ఆ విషయాన్ని ప్రజలకు గుర్తు చేయడం తప్పు అని పవన్ కళ్యాణ్ భావిస్తే ఆ మాట చెప్పవచ్చు. తన ఇబ్బంది ఏదో తెలియచేసి ఉండవచ్చు. కాని అలాకాకుండా మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండని చెప్పడం ద్వారా సమాజానికి ఆయన ఏమి సంకేతం ఇస్తున్నారు. ఎవరు ఒక సంసారంతో ఉండవద్దని చెప్పదలిచారా? ఎవరితోనైనా సహజీవనం చేయవచ్చని అనదలిచారా? ఇది నిజంగా ఒక నాయకుడికి తగదు. జగన్ కూడా మనిషే కదా.. పదే పదే జైలు.. జైలు అంటుంటే ఆయన ఊరుకుంటారా? సోనియాగాంధి, చంద్రబాబులు కలిసి కుట్ర పన్ని జగన్‌ను జైలుకు పంపించారన్న విషయం పవన్ కళ్యాణ్ కు తెలియదా?
స్వయంగా దివంగత బిజెపి నేత సుష్మస్వరాజ్ స్వయంగా పార్లమెంటులోనే ఈ విషయం చెప్పారే. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ సొంత పార్టీ పెట్టుకోగానే ఆయనపై కాంగ్రెస్ కేసులు పెట్టిందని పార్లమెంటు సాక్షిగా సుష్మ అన్నారే. ఆ విషయం పక్కన బెడితే పవన్ కళ్యాణ్ తన పిల్లలను ఎందుకు ఆంగ్ల మీడియం బడులలో చదివించింది చెప్పకుండా తాను తెలుగు భాష ఉద్యమ కారుడిని అని చెబితే ఎవరు ఒప్పుకుంటారు? పైగా తన కొడుకు చేరిన అంతర్జీతీయ స్కూల్ ఒక్రిడ్జ్ ఎంత గొప్పదో ప్రచారం చేశారే.. మరి ఎన్నడైనా ఒక ప్రభుత్వ స్కూల్ గురించి పవన్ చెప్పారా? ఇప్పుడు సడన్‌గా మాతృభాష పై పవన్‌కు ప్రేమ వచ్చిందా? వెంకయ్య నాయుడు గురించి కూడా ప్రస్తావిస్తారా అని పవన్ కళ్యాణ్ అడిగారు.
ఉప రాష్ట్రపతి అయినంత మాత్రాన ఆయన అతీతుడు అవుతారా? ఏపీలో ఆంగ్ల మాధ్యమంలో బోధన అనగానే ఆయన ప్రత్యక్ష్యంగనో, పరోక్షంగానో ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాసాలు రాయవచ్చా? అసలు ఉప రాష్ట్రపతిగా ఉన్నవారు ఎవరైనా ఇలాంటి విషయాలలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారా? అయినా ఫర్వాలేదు. నిజంగానే ఆయనకు మాతృభాషపై అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రికి ఫోన్ చేసి తగు సలహాలు ఇచ్చి ఉండవచ్చు కదా? అలా కాకుండా టిడిపి నేతలు, లేక రామోజీరావో చేస్తున్న ప్రచారానికి లేదా వారి ఎజెండాకు అనుగుణంగా ప్రకటనలు ఎందుకు చేయాలి? అంత మాతృభాష పై అభిమానం ఉంటే ఆయన కుటుంబం నిర్వహించే స్వర్ణభారతి ట్రస్టు నడిపే స్కూళ్లలో ఎందుకు తెలుగు మీడింయం పెట్టలేదు? ఆ ప్రశ్నకు సమాధానం రావాలి కదా?
ఇక రామోజీరావు గారు ఇప్పుడు తెలుగు భాష కోసం ఉద్యమిస్తున్నారు కదా.. మరి ఆయన నడిపే స్కూల్‌లో తెలుగు మీడియం ఎందుకు పెట్టలేదో వివరించాలి కదా.. ఇవి అడిగితే వ్యక్తిగత విషయాలని అంటే అర్ధం ఏమైనా ఉందా? అలాగే చంద్రబాబు గండిపేటలో నడిపే ఎన్టిఆర్ మోడల్ స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టారు? ఆయన తన కుమారుడు లోకేష్‌కు అసలు తెలుగు భాష లేని స్కూల్‌లో చేర్చారట. పోని ఇప్పుడు ఆయన మనుమడు దేవాంశ్‌ను ప్రభుత్వ స్కూల్‌లో అది కూడా తెలుగు మీడియంలో వేస్తామని ధైర్యంగా చెప్పగలరా? అందుకు ఆయన కొడుకు, కోడలు ఒప్పుకుంటారా? ఆయనే కాదు. ఏ పార్టీ నేతలైనా వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో, తెలుగు మీడియం స్కూళ్లలో ఎందుకు చేర్చడం లేదు?
83 శాతం మంది అగ్రవర్ణాల పిల్లలు ఆంగ్ల మీడియం ఉన్న ప్రైవేటు స్కూళ్లలోనే ఎందుకు చదువుతున్నారు. ఆర్థికంగా స్థోమత లేనివారు, బలహీన వర్గాలవారు ప్రైవేటు స్కూళ్లలో చేర్చలేనివారే ప్రభుత్వ స్కూళ్లకు పరిమితం అవుతున్నారే? అంటే అగ్రవర్ణాల పిల్లలు ఆంగ్ల మీడియం చదువుకోవచ్చని, మిగిలినవారు మాత్రం తెలుగును రక్షించాలని పవన్ కళ్యాణ్ చెప్పదలిచారా? జగన్ పై గుడ్డి వ్యతిరేకతతో మాట్లాడితే పవన్ కళ్యాణ్‌కే నష్టం. ప్రముఖ విద్యావేత్త కంచ ఐలయ్య రాసిన వ్యాసం ఒకసారి పవన్ చదివితే బలహీనవర్గాలలో ఆంగ్ల భాషపై ఆర్తి ఎలా ఉందో అర్ధం అవుతుంది. చంద్రబాబు మాదిరే ఆయన మాట్లాడితే ఈయనకు సొంత పార్టీ ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుందన్న సంగతి ఆయన గ్రహించలేకపోతున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు కూడా పక్కా నేర్పండి అని చెబితే తప్పు కాదు.. ప్రభుత్వ స్కూల్ టీచర్‌లకు ఆంగ్ల బోధనలో బాగా శిక్షణ ఇవ్వండి అంటే తప్పు కాదు.. కాని పురందేశ్వరి వంటి నేతలు కొందరు ప్రభుత్వ స్కూల్ టీచర్లను అవమానించేలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ స్కూల్ టీచర్లు రెండు లైన్‌లు ఆంగ్లంలో మాట్లాడలేరని అంటున్నారు. అంటే ప్రైవేటు స్కూళ్లలో అంతా బ్రహ్మాండంగా ఉన్నారని ఆమె సర్టిఫికెట్ ఇస్తున్నారా? ఆమె తన పిల్లలను మాత్రం హైదరాబాద్‌లో ఎక్కడ చదివించారో చెప్పగలరా? పవన్ కళ్యాణ్ కాని మరి కొందరు నేతలు కాని ఇంగ్లీష్ మీడియంపై అనవసర రాద్దాంతం చేస్తున్నారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్ల మీడియం పెట్టడానికి ప్రయత్నించింది కదా. మరి అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించలేదు. అప్పుడు వ్యతిరేకించి, ఇప్పుడు ఎవరైనా సమర్ధించినా తప్పే అవుతుంది. అయితే ఇక్కడ ఆంగ్ల మీడియంను వ్యతిరేకిస్తున్న నేతలంతా ఒకసారి ఏపీలో పిల్లల తల్లులు ఏమనుకుంటున్నారో ఒకసారి అభిప్రాయ సేకరణ చేస్తే అర్ధం అవుతుంది. అయినా వాస్తవాలు తెలిసినా, అబద్ధాలు చెప్పాలనుకుంటే. నిద్ర పోతున్నట్లు నటించేవారికి ఏమి చెప్పినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే అవుతుంది.
కొమ్మినేని శ్రీనివాసరావు