తెలుగుదేశం పార్టీ యువత విభాగానికి కొత్త నేత అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్త బాధ్యతలు రాయలసీమ యువనేతల్లో ఒకరికి దక్కబోతున్నాయనే మాట వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో చిత్తు అయ్యిందో వేరే చెప్పనక్కర్లేదు.
చంద్రబాబు నాయుడు, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ, టీడీపీ సీనియర్ పయ్యావుల కేశవ్ తప్ప అంత పెద్ద రాయలసీమ నుంచి కనీసం ఒక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నెగ్గలేకపోయారు. రాయలసీమలో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఊచకోత కోసినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనుకున్న అనంతపురం జిల్లాలో కూడా ఆ పార్టీ తన చరిత్రలో ఎరగనంత స్థాయి ఓటమిని మూటగట్టుకుంది. ఇలాంటి నేపథ్యంలో సీమలో తెలుగుదేశం పార్టీ దాదాపు నిస్తేజంగా మారింది. టీడీపీ చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరిపడిన వాళ్లంతా ఇప్పుడు కామ్ అయిపోయారు. ఎన్నో దశాబ్దాలుగా ఉనికిని చాటుకున్న రాజకీయ కుటుంబాలు కూడా జగన్ గాలిలో ఓటమిని మూటగట్టుకున్నాయి. దీంతో ఎలా స్పందించాలో కూడా అర్థం కాని స్థితిలో వారున్నారు.
తమ కంచుకోటలు అనుకున్న నియోజకవర్గాల్లో ఓటమి ఎదురయ్యే సరికి వారు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఇక అధికారంలో ఉన్న సమయంలో చేసిన పనులు కూడా ఏమంత గొప్పగా లేవు. దీంతో వారిది మారు మాట్లాడలేని పరిస్థితి. జిల్లాలకు జిల్లాలనే శాసించిన వారు కూడా ఇప్పుడు తమ ఇంటి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేని స్థితిలో ఉన్నారు. అంతటి రాజకీయ పరాభవంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్లు.
ఈ క్రమంలో తెలుగుయువతకు కొత్త నేతను రాయలసీమ నుంచినే ఎంపిక చేయనున్నారనే టాక్ మొదలైంది. ఆ విషయంలో పలు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. జేసీ పవన్ కుమార్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, భూమా అఖిలప్రియ వంటి వాళ్ల పేర్లు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ప్రధానంగా ఈ ముగ్గురిలో ఒకరికి ఆ పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతూ ఉంది.
అయితే వీరిలో ఆ పదవిని తీసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారనేది కూడా పెద్ద సందేహంగానే ఉంది. భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో ఉంటారా, ఉండరా అనేది మిస్టరీగానే ఉంది. ఆమె ఓడిపోయిన దగ్గర నుంచి 'జగనన్న' అంటున్నారు. మరోవైపు ఆమె భర్తపై కేసులు గట్టిగానే నమోదవుతూ ఉన్నాయి. ఆ కేసుల విషయంలో కూడా ఆమె సీఎంను నిందించడం లేదు. పోలీసులు కక్ష గట్టి తన భర్తపై కేసులు పెడుతున్నారని ఆమె అంటున్నారు! ప్రభుత్వం కాదు, పోలీసులు తన భర్త మీద కక్ష కట్టారనేది అఖిలప్రియ చేస్తున్న ఆరోపణ. ఇలాంటి తరుణంలో ఆమె తెలుగుయువతకు అధ్యక్షురాలు అవుతుందా? అనేది ప్రశ్నార్థకమే. ఆమె బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్ కూడా నడుస్తూ ఉంది.
ఇక జేసీ పవన్ రెడ్డి పొలిటికల్ గా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. రాజకీయాల నుంచి రిటైర్డ్ అయినట్టుగా ప్రకటించుకున్న దివాకర్ రెడ్డి అయినా కాస్త యాక్టివ్ గా ఉన్నారు కానీ, పవన్ మాత్రం అంతగా కనిపించడం లేదు. మరో సంగతి ఏమిటంటే.. తెలుగు యువత పగ్గాలను ఒక రెడ్డికి ఇస్తారా? అనేది అస్పష్టమైన అంశం.
అధినేతగా చంద్రబాబు నాయుడు ఉన్నా.. ఆ పదవిని కమ్మ వ్యక్తులకు కట్టబెడుతూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక రెడ్డికి తెలుగు యువత పగ్గాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఏ మాత్రం ఇష్టపడకపోవచ్చు. ప్రత్యేకించి ఆ పార్టీ వీరాభిమాన సామాజికవర్గానికి అది ఇష్టం లేదని ప్రక్రియ అవుతుంది.
అందుకే మధ్యేమార్గం జేసీ పవన్ అనుచరురాలు బండారు శింగనమల నుంచి పోటీ చేసి ఓడిన శ్రావణికి ఆ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఆమె రాజకీయాలకు కొత్త. దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఇలాంటి సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని.. పవన్ ఆశీస్సులు ఉన్నాయని ఆమెకు ఆ పదవిని ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక జేసీలు కూడా ఎన్నాళ్లు తెలుగుదేశంలో ఉంటారనేది ప్రశ్నార్థకమే.ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి పూర్తిగా కామ్ అయిపోయారు. దివాకర్ రెడ్డి మాత్రమే అడపాదడపా హడావుడి. అది కూడా తన అనుచరుల విషయంలోనే. పార్టీ కోసం కాదు. జేసీ వర్గానికి ఆ పదవిని ఇచ్చినా వాళ్లే జంప్ చేస్తే కథ మళ్లీ మొదటకు వస్తుంది.
ఇక తెలుగుదేశం పార్టీకి పెద్ద ఆశాకిరణం అనుకున్న పరిటాల కుటుంబం కూడా ఇటీవలి ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. చాన్నాళ్లుగా ఎరగని ఓటమి ఎదురయ్యే సరికి వారు ఖిన్నులయ్యారు. వారి ప్రత్యర్థి నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడు. ప్రత్యర్థిని కొన్ని ఊళ్లలో ప్రచారం కూడా చేయనివ్వని వాళ్లు ఓడిపోతే, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనాల్సి ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. రాజకీయంగా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వాళ్లు. ఆపై పరిటాల శ్రీరామ్ లో వ్యక్తిగత ఛరిష్మా ఏమీ కనిపించడం లేదు. కేవలం రాజకీయ వారసత్వం మాత్రమే అతడిని నిలుపుతోంది. ఆకట్టుకునే మాట్లాడే స్కిల్ కానీ, చొచ్చుకుపోయే తత్వం కానీ శ్రీరామ్ లో తెలుగుదేశం వాళ్లే చూడలేకపోతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో సీమ నుంచి తెలుగు యువత అధ్యక్ష పదవికి పరిగణనలో ఉన్న ఎవరికి ఆ పదవిని కట్టబెట్టినా వారు అలంకార ప్రాయం మాత్రమే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.