కేసీఆర్ తేల్చేశారు.. ఇక మిగిలింది జగనే!

బీజేపీతో పొత్తుపై రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్నటివరకు చాలా సస్పెన్స్ నడిచింది. రాబోయే ఎన్నికల్లో ఇటు జగన్, అటు కేసీఆర్ బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారంటూ ఈమధ్య కాలంలో చాలా విశ్లేషణలొచ్చాయి.  Advertisement సార్వత్రిక ఎన్నికలు…

బీజేపీతో పొత్తుపై రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్నటివరకు చాలా సస్పెన్స్ నడిచింది. రాబోయే ఎన్నికల్లో ఇటు జగన్, అటు కేసీఆర్ బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారంటూ ఈమధ్య కాలంలో చాలా విశ్లేషణలొచ్చాయి. 

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, ఈ పొత్తుపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. తెలంగాణ నుంచి కేసీఆర్ తన వైఖరి ఏంటో స్పష్టంచేశారు. ఇక మిగిలింది జగన్ మాత్రమే.

బీజేపీపై టీఆర్ఎస్ ఓపెన్ వార్

మొన్నటివరకు బీజేపీకి అంశాలవారీగా మద్దతిస్తూ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడైతే హుజూరాబాద్ ఎన్నికలు ముగిసి, ఫలితం బీజేపీకి అనుకూలంగా వచ్చిందో అప్పుడిక టీఆర్ఎస్ నేతలంతా ముసుగులు తీసేశారు. బీజేపీపై ఓపెన్ వార్ ప్రకటించారు. దానికి ధాన్యం కొనుగోలు అంశాన్ని అస్త్రంగా మలుచుకున్నారు. ఈ వేడిని ఇలానే కొనసాగించి, వచ్చే ఎన్నికల నాటికి లబ్ది పొందాలని చూస్తోంది టీఆర్ఎస్. 

కేసీఆర్ ఎత్తులు పైఎత్తుల సంగతి పక్కనపెడితే.. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉండదని తేలిపోయింది. లోపాయికారీ ఒప్పందాలు కూడా ఉండబోవనే విషయం అర్థమౌతూనే ఉంది.

మరి ఏపీలో జగన్ సంగతేంటి?

ఇక ఇప్పుడు తేల్చాల్సింది జగన్ మాత్రమే. అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఈ క్షణం వరకు బీజేపీతో సమదూరం పాటిస్తున్నారు జగన్. అంశాల వారీగా మాత్రమే మద్దతిస్తున్నారు. వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తే వ్యతిరేకిస్తూనే, మద్దతివ్వాల్సిన చోట మద్దతు అందిస్తూ వస్తున్నారు. అలా రెండున్నరేళ్లు గడిచిపోయాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఇలానే కొనసాగించడం కష్టం. 

ఎందుకంటే, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో సహా చాలా అంశాలపై బీజేపీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇలా ఓవైపు స్పష్టత లేకుండానే, మరోవైపు బీజేపీతో అంశాలవారీగా పొత్తును కొనసాగించడం వైసీపీకి ఎంతమాత్రం మంచిది కాదు.

ఇకపై రాజీ పనికిరాదు

ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, పెండింగ్ ప్రాజెక్టులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యేక నిధులు.. ఇలా ఎన్నో అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ప్రత్యేకంగా చేసిందేం లేదు. అదనపు నిధులు కూడా లేవు. అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టుగానే కేటాయింపులున్నాయి. 

ఇలాంటి టైమ్ లో బీజేపీతో దోస్తీ కట్టాల్సిన అవసరం జగన్ కు లేదు. పైగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి సున్న. కేంద్రంలో రెండో దఫా ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కమలంకు అంత సీన్ లేదు. తాజాగా బద్వేల్ ఉప ఎన్నికతో ఆ విషయం మరోసారి రుజువైంది.

కాబట్టి బీజేపీ విషయంలో ఇకనైనా వైఎస్ జగన్ మెతక వైఖరి మానుకుంటే మంచిది. 22 మంది ఎంపీలున్నప్పటికీ వైసీపీ ఏం చేయలేకపోతోందంటూ ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలన్నా.. వచ్చే ఎన్నికల నాటికి కమలంతో ప్రయాణం ఎలా ఉండబోతోందనే అంశంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నా.. జగన్ ఇప్పట్నుంచే ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది.