ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దాదాపు ముగింపు దశకు చేరింది. వివేకా హత్య కేసు మిస్టరీని ఛేదించింది. 2019 మార్చి 15వ తేదీ పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి దారుణహత్యకు గురి కావడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి పొద్దుటూరు కోర్టులో ఈ ఏడాది ఆగస్టు 31న నేర అంగీకార వాంగ్మూలాన్ని ఇచ్చాడు. దాన్ని సీబీఐ అధికారులు నమోదు చేసుకున్నారు. వాంగ్మూలాన్ని శనివారం ఇతర నిందితులకు అందించారు.
ఇదిలా వుండగా దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆర్థిక లావాదేవీల్లో చోటు చేసుకున్న విభేదాలే హత్యకు దారి తీసినట్టు నిందితుడు దస్తగిరి వెల్లడించాడు. వివేకాను అంతమొందించేందుకు రూ.40 కోట్ల సుపారీ చేతులు మారినట్టు అతను చెప్పాడు. తనతో పాటు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, వివేకా ముఖ్య అనుచరుడు ఎర్రగంగిరెడ్డి కలిసి హత్యకు పాల్పడినట్టు దస్తగిరి నేరాన్ని అంగీకరించాడు.
దస్తగిరి మరో బాంబు కూడా పేల్చాడు. వివేకా హత్యకు తాను వెనుకాడగా ఎర్రగంగిరెడ్డి ఉసిగొల్పాడన్నాడు. ఈ సందర్భంగా ఎర్రగంగిరెడ్డి తనతో .. ‘నువ్వు ఒక్కడివే కాదు.. మేము కూడా వస్తాం. దీనివెనుక పెద్దవాళ్లు ఉన్నారు’ అని అన్నట్టు చెప్పాడు. ‘ఎవరా పెద్దవాళ్లు’ అని తాను అడగ్గా.. ‘వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, డి. శంకర్‌రెడ్డి ఉన్నారు’ అని గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి..మేజిస్ర్టేట్ ఎదుట కుండబద్దలు కొట్టాడు.
వైఎస్ అవినాష్‌రెడ్డి కడప పార్లమెంట్ సభ్యుడు. అవినాష్‌రెడ్డి తండ్రే వైఎస్ భాస్కర్‌రెడ్డి. అలాగే అవినాష్‌కు వైఎస్ మనోహర్‌రెడ్డి చిన్నాన్న. దస్తగిరి చెప్పిన డి.శంకర్‌రెడ్డి ప్రస్తుతం వైసీపీలో రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నాడు. ఈయన దొండ్లవాగు శంకర్రెడ్డిగా సుపరిచితుడు. కడప షాడో ఎంపీ అని ఆ పార్టీ నాయకులు ముద్దుగా పిలుచుకుంటుంటారు. దీన్నిబట్టి వైఎస్ అవినాష్‌కు దొండ్లవాగు శంకర్‌రెడ్డి ఎంత సన్నిహితుడో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం వైఎస్ అవినాష్‌రెడ్డి కడప జిల్లా వైసీపీకి, అధికారిక పనులకు పెద్ద దిక్కు. అవినాష్‌కు తెలియకుండా చీమ కూడా కుట్టని పరిస్థితి. తన తండ్రి హత్యలో వైఎస్ అవినాష్, భాస్కర్‌రెడ్డి, దొండ్లవాగు శంకర్‌రెడ్డి పాత్రలపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం ఆమె అనుమానమే నిజమైంది.
తన చిన్నాన్న హత్యపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి పాత్రలో వైఎస్ జగన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నాటి గవర్నర్ నరసింహన్‌కు హైదరాబాద్‌లో వినతిపత్రం కూడా సమర్పించారు. ఆ తర్వాత హత్యపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ తన చిన్నమ్మ (వివేకా భార్య)తో కలిసి ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్‌ను అనూహ్యంగా జగన్ వెనక్కి తీసుకున్నారు. కానీ జగన్ చెల్లి డాక్టర్ సునీత మాత్రం పట్టువదలకుండా న్యాయపోరాటం సాగించి ….చివరికి సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చేలా విజయం సాధించింది. వివేకా హత్య కేసులో తాజాగా సీబీఐ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితులంతా పెద్ద తలలే ఉండడం, అది కూడా తన కుటుంబ సభ్యులే ఉండడం జగన్ జీర్ణించుకోలేనిదే.
దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థగా వివేకా హత్య కేసు మిస్టరీని ఛేదించింది. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురితో పాటు సహకరించిన పెద్ద వాళ్ల విషయంలో న్యాయస్థానం తీర్పు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశం కాదు. కానీ ప్రజాకోర్టులో మాత్రం జగన్ సొంతవాళ్లే హత్యకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది. వాళ్లకు జగన్ విధించే శిక్ష ఏంటో తెలుసుకునేందుకు జనం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అందుకే జగన్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. జగన్ సార్ మీకు అర్థమవుతోందా?