డాక్టర్ ను చూసి వాతలు పెట్టుకున్న విక్రమార్క

సీరియస్ కథల్ని కాస్త సరదగా చూపించడమనే ట్రెండ్ సౌత్ లో చాన్నాళ్లుగా నడుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్స్ కు కామెడీ అద్దడం లాంటివి కోలీవుడ్ లో ఎక్కువగా చూస్తున్నాం. ఈమధ్య వచ్చిన డాక్టర్ అనే సినిమా…

సీరియస్ కథల్ని కాస్త సరదగా చూపించడమనే ట్రెండ్ సౌత్ లో చాన్నాళ్లుగా నడుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్స్ కు కామెడీ అద్దడం లాంటివి కోలీవుడ్ లో ఎక్కువగా చూస్తున్నాం. ఈమధ్య వచ్చిన డాక్టర్ అనే సినిమా కూడా ఇదే కోవకు చెందుతుంది. 

శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో మంచి విజయాన్నందుకుంది, సరైన ప్రమోషన్ లేక టాలీవుడ్ లో ఇది పెద్దగా సక్సెస్ అవ్వలేదు కానీ, తెలుగు వెర్షన్ చూసిన టాలీవుడ్ ప్రేక్షకులంతా ఈ మూవీని ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు.

ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, దాదాపు ఇదే ఫార్ములాతో తెలుగులో వచ్చింది రాజా విక్రమార్క సినిమా. ఇదొక సీరియస్ ఏజెంట్ సినిమా. ఎన్ఐఏ, హోం మినిస్టర్ కూతురు కిడ్నాప్, అక్రమంగా ఆయుధాల సరఫరా లాంటి సీరియస్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఇలాంటి సీరియస్ కథను సరదాగా ప్రజెంట్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ డాక్టర్ మేజిక్ ను రాజా విక్రమార్క రిపీట్ చేయలేకపోయింది.

డాక్టర్ సినిమాలో భలే కామెడీ ఉంది. యోగిబాబు, పోలీసాఫీసర్ గా చేసిన మరో వ్యక్తి చేసిన కామెడీ టోటల్ సినిమాకే హైలెట్. దీనికితోడు విలన్ గ్యాంగ్ లో ఉన్న ఒకరిద్దరు నటులు కూడా మంచి కామెడీ పండించారు. ఇలాంటి గట్టి ప్రయత్నం రాజా విక్రమార్కలో మిస్సయింది. డాక్టర్ సినిమాలో హీరో కామెడీ చేయడు, చుట్టుపక్కలున్న ప్యాడింగ్ ఆర్టిస్టులు (హీరోయిన్ తో కలిపి) కామెడీ చేస్తుంటారు. రాజావిక్రమార్కలో మాత్రం హీరోతో కామెడీ చేయించే ప్రయత్నం చేయించారు.

డాక్టర్ సినిమాలో ఎక్కడా లాజిక్కులు మిస్సవ్వలేదు. అక్కడక్కడ కాస్త అతి అనిపించినప్పటికీ, సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ కామెడీ డోస్ పడ్డంతో అన్నీ పక్కకెళ్లిపోయాయి. విక్రమార్క సినిమాలో మాత్రం కామెడీ సరిగ్గా పండకపోవడంతో.. మిస్సయిన లాజిక్కులు, ఓవర్ గా తీసుకున్న లిబర్టీలు తెరపైకొచ్చాయి.

ఓవరాల్ గా చూసుకుంటే.. ఒకే సీజన్ లో వచ్చిన డాక్టర్, రాజా విక్రమార్క సినిమాల్లో కామెడీ క్లిక్ అవ్వడంతో ఓ సినిమా హిట్టవ్వగా.. అదే కామెడీ ఫెయిల్ అవ్వడంతో మరో సినిమా నిరాశపరిచింది.