చంద్రబాబు రాజకీయ సన్యాసానికి ఇది శ్రీకారం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికంటె ఎక్కువగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన, అపర చాణక్యుడిగా పేరున్న, నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతం అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో ఇప్పుడు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికంటె ఎక్కువగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన, అపర చాణక్యుడిగా పేరున్న, నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతం అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో ఇప్పుడు విషమపరీక్షను ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా తనకు బ్రహ్మరథం పట్టిన కుప్పం నియోజకవర్గంలో ఉన్న ఒకే ఒక్క మునిసిపాలిటీని కూడా తన పార్టీ దక్కించుకోకపోతే.. తన పరువు ఏ పాతాళానికి దిగజారిపోతుందో చంద్రబాబుకు చాలా బాగా తెలుసు. అందుకే ఆయన ఈ ఎన్నిక విషయంలో విపరీతమైన ఒత్తిడికి, ఆందోళనకు  గురవుతున్నారు. 

కుప్పం మునిసిపాలిటీ మీద ఇప్పుడు రాష్ట్రంలో అందరి దృష్టి ఉంది. సోమవారం ఇక్కడ ఎన్నిక జరగనుంది. మొత్తం 25 వార్డులు ఉన్నాయి. కనీసం 15 వార్డులు చేజిక్కించుకోవాలనేది వైఎస్సార్ కాంగ్రెస్ టార్గెట్. మునిసిపాలిటీ చేజారకుండా చూసుకోవాలనేది తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య. 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం మెజారిటీ భారీగా తగ్గడం, ఆ తర్వాతి పరిణామాల్లోనూ కొందరు నాయకులు వైసీపీలోకి మారడం తదితర కారణాల వలన.. ఒత్తిడి మాత్రం టీడీపీ మీదనే ఉంది. 

‘విక్టరీ మేకర్’ పెద్దిరెడ్డి..

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు, అరాచకాలకు తెరతీశారు, బయటి వ్యక్తులనె పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి ఓట్లు వేయించారు.. ఇలాంటి విమర్శలు ఎన్నయినా ఉండవచ్చు గాక- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార పార్టీకి విక్టరీ మేకర్ గా పేరు తెచ్చుకున్నారు. గెలుపు ఎంతో సులువే అయినప్పటికీ తిరుపతి పార్లమెంటు, బద్వేలు ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల మీద కూడా పెద్దిరెడ్డి చాలానే కసరత్తు చేశారు. ఎఫర్ట్ పెట్టారు. వైసీపీ తరఫున ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అక్కడ చక్రం తిప్పడానికి, మంత్రాంగం నడపడానికి కీలక నాయకుడిగా ముద్రపడ్డారు. 

అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబునాయుడుతో ‘వ్యక్తిగతం’ అనదగిన రాజకీయ వైరం కూడా ఉంది. వీరిద్దరూ ఎస్వీయూనివర్సిటీలో పీజీ చేస్తున్నప్పటినుంచి శత్రువులు. అలాంటి అయిదు దశాబ్దాల వైరం నేపథ్యంలో.. కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలను స్వయంగా పర్యవేక్షించాల్సి వస్తే పెద్దిరెడ్డి అంత తేలిగ్గా ఎలా తీసుకుంటారు. కుప్పంలో అదే కనిపిస్తోంది. 

పెద్దిరెడ్డి.. తన సొంత ఎన్నికలకైనా ఇంతగా ఇంటింటి ప్రచారం చేశారో లేదో అనిపించేలా ఆయన కుప్పంలో కష్టపడుతున్నారు. తిరుపతి, బద్వేలు ఎన్నికలు వేరు- కుప్పం ఎన్నికలు వేరు అన్న తీరుగా ఆయన కష్టం కనిపిస్తోంది. తిరుపతి, బద్వేలుల్లో నాలుగుగోడల మధ్య కూర్చుని నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ పరిణామాల్ని శాసించే పాత్ర పెద్దిరెడ్డి ఎక్కువగా పోషించారని అంతా అంటుంటారు. అయితే కుప్పంలో అలాంటి పాత్రతో పాటు.. ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నారు. వార్డుల్లో తిరుగుతూ ఉన్నారు. 

పోయేది తన పరువే అయినా.. కుప్పం మునిసిపాలిటీ ఎన్నికకోసం తాను రావడం, ప్రచారం చేయడం పరువు తక్కువ పనిగా చంద్రబాబుకు అనిపించి ఉండవచ్చు. లోకేష్ మాత్రమే ఇక్కడ కీలకంగా ఎన్నికల బాధ్యత చూస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఉజ్జీ అయిన పెద్దిరెడ్డి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

ధనప్రవాహం

ఓట్ల కొనుగోలు లేకుండా ఎన్నికలే ఉండని రోజులివి. కుప్పం మునిసిపాలిటీ విషయానికి వచ్చేసరికి ఒక్కో ఓటుకు వెల 1500 దగ్గర ప్రారంభం అయింది. 2000 ఇవ్వడానికి కూడా తెలుగుదేశం సిద్ధపడింది. అలా జరిగితే వైసీపీ 3000 వంతున ఇస్తారని వినిపించింది. అయితే ఆ మాటలన్నీ పాతబడిపోయాయి. 

కుప్పంలో తెలుగుదేశం ఒక్కో ఓటుకు 5000 రూపాయలు ఇస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వంలో కీలకం అయిన మంత్రి చేసిన సదరు ప్రకటన ద్వారా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 6000 వరకు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని ప్రజల్లోకి సంకేతాలు పంపినట్లుగా అయింది. 

డబ్బు ప్రభావం విచ్చలవిడిగా కనిపిస్తోంది. ఐదారువేల ధర మామూలుగా ఉండగా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటుకు పదివేల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నదనేది ఒక పుకారు. ఓటుకు పదివేలు అనగానే.. నియోజకవర్గంలో ఓట్లు లెక్కేసి.. అంత ఖర్చు తమాషానా? అంటూ వెటకారాలు చేయక్కర్లేదు. పదివేలు అందరికీ ఇవ్వరు. సెలక్టివ్ గా టఫ్ ఫైట్ ఉన్న కొన్ని వార్డుల్లో తెలుగుదేశం ఓట్లుగా భావిస్తున్న వారికి మాత్రం.. ఓటుకు పదివేల వంతున ఇచ్చి.. అక్కడ ఫలితాల్ని శాసించాలనేది ఒక వ్యూహంగా కనిపిస్తోంది. 

నారా లోకేష్ ఎన్నికల సీన్ లోకి ఎంటరైనప్పటినుంచి.. డబ్బు కూడా సమాంతరంగా పోటెత్తింది. ఒకవైపు సందుగొందుల్లో లోకేష్ ప్రచారం సాగుతున్న సమయంలోనే.. ఆ పక్కవీధుల్లో పంపిణీలపర్వం కూడా యథేచ్ఛగా జరిగిపోతున్నదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా భారీగా ఖర్చు పెడుతోంది. టీడీపీ ఎంత ఇస్తే.. అంతకంటె ఎక్కువ ఆఫర్ తో ఓటర్లను కొనుగోలు చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉంది.

తెలుగుదేశం భక్తులు సైలెంట్

తెలుగుదేశం మరియు చంద్రబాబు భక్తులు చాలావరకు సైలెంట్ గా ఉంటున్నారు. కుప్పం మునిసిపాలిటీ యావత్తూ జనం పోటెత్తినట్టుగా ఉన్నది వాతావరణం. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు గుంపులు గుంపులుగా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఊరంతా చాలా హడావుడి ఉంది. ఇదంతా ఓటర్ల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. 

తెలుగుదేశం వీర భక్తులు సైలెంట్ గా అయిపోతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ వారు సైలెంట్ కావడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. చంద్రబాబునాయుడు తీరు అందుకు ఒక ప్రధాన కారణం. ఆయన స్థానికంగా కొందరు నాయకుల్ని తన ఏజంట్లు లాగా నియమించుకున్నారు. వారు ఎడా పెడా దందాలు సాగించారు. ఒక్కొక్కరూ కోట్లకు పడగలెత్తారు. 

నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను సరిగా పట్టించుకోకుండా తలబిరుసుతో వ్యవహరించేవారనే పేరుంది. వీరి తీరు మీద స్థానిక సామాన్య కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే చాలా ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన కార్యకర్తల్ని పట్టించుకోలేదని అంటారు. ఇవన్నీ కలిపి.. చంద్రబాబునాయుడు తీరు మీద కార్యకర్తలకు మొహం మొత్తింది. ఈ అవకాశాల్ని వైసీపీ చక్కగా వాడుకుంది. ఇప్పుడు ఆధిపత్యం నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. 

ఓడితే.. చంద్రబాబుకు సన్యాసయోగమే..

ఒకప్పట్లో చంద్రబాబునాయుడుకు అప్రతిహతమైన పెట్టని కోట అని కుప్పం గురించి అందరూ చెప్పుకునేవారు. మొత్తం చిత్తూరు ఎంపీ నియోజకవర్గం పరిధిలో అన్ని స్థానాలను వైరిపక్షం గెలుచుకున్నప్పటికీ.. ఒక్క కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశానికి లభించే మెజారిటీ.. చిత్తూరు ఎంపీని కూడా గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ హవా మొత్తం గంగలో కలిసిపోయింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మెజారిటీ 17వేలు తగ్గింది. 30వేల మెజారిటీ మాత్రమే లభించింది. 

అప్పటికీ ఇప్పటికీ కుప్పం లో పరిస్థితులు చాలా మారాయి. బాబు హవా ఇంకా పలచబడింది. ఇటీవలి కాలంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశాల్లో ‘మీకు ఎంత చేసినా.. వైసీపీ బలపడుతోందంటే.. మీకు (నియోజకవర్గ ప్రజలకు) కృతజ్ఞత లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. వైసీపీ స్పష్టమైన ఆదిక్యం కనబరుస్తోంది. ఎన్నికల్లో ఫలితం కూడా వారికే అనుకూలంగా వస్తే గనుక.. చంద్రబాబునాయుడుకు డేంజర్ బెల్స్ మోగినట్టే. 

ఓటమే ఎదురైతే గనుక.. ఇక చంద్రబాబునాయుడు ఇంకో నియోజకవర్గం చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మునిసిపాలిటీలో పార్టీని ఓడించిన వారు.. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతమై చంద్రబాబును ఓడించడం కూడా సునాయాసంగా జరుగుతుందనేది సగటు అంచనా. 

చంద్రబాబునాయుడు చాలా తెలివైన వారు. అలాంటి సంకేతాలు నామమాత్రంగా కనిపించినా.. ఆయన వేరే నియోజకవర్గం ఎంచుకుని అటు పారిపోగలరు. నిజానికి అప్పటికి నలభై అయిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత.. మళ్లీ కొత్త ఊరు ఎంచుకుని, కొత్తగా అక్కడి ప్రజల నమ్మకాన్ని చూరగొని ప్రయాస పడడం ఎందుకని అనుకుంటే గనుక.. ఆయన ఏకంగా రాజకీయ సన్యాసం కూడా తీసుకోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 

2019 నాటికో, ఆతర్వాతి కాలానికో.. రాజకీయ వాతావరణం తన పార్టీకి, తన నాయకత్వానికి అనుకూలంగా లేనప్పుడు చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. అలా ఒకనాటికి తప్పనిసరి కాగల చంద్రబాబు రాజకీయ సన్యాస యోగానికి ఇప్పుడు కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు శ్రీకారం దిద్దబోతున్నాయి.