టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ అంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రెచ్చిపోతుంటారు. ఈ దఫా కాస్త హద్దులు దాటారనే భావన సొంత పార్టీ నుంచే వ్యక్తమవుతోంది. విశాఖలో విజయసాయిరెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ, బీజేపీ డివిజన్ స్థాయి నాయకులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్‌పై విజయసాయి చెలరేగిపోయారు.
టీడీపీ సోషల్ మీడియా అడ్వయిజర్ సలహాతో లోకేశ్ బాడీ లాంగ్వేజ్, మాట్లాడే పదజాలం సభ్యసమాజం తలదించుకునే విధంగా మారిపోయిందన్నారు. అడవుల్లో నివసించే ఆది మానవుల ప్రవర్తన, సంస్కారం లేని భాష మాట్లాడితే ప్రజలు హర్షించరని విజయసాయి తెలిపారు. లోకేశ్ మాటలు వింటే అసలు రాజకీయాలకు అర్హుడా అనే అనుమానం కలుగుతుందన్నారు.
లోకేశ్ ఈ సమాజంలోనే పుట్టాడా? అమెరికాలో ఎంబీఎ చదివాడా? ఇవన్నీ బోగస్ డిగ్రీలా? నీకేమైనా మతి భ్రమించిందా అనే సందేహం కలుగుతుందని విరుచుకుపడ్డారు. 2024కి తెలుగుదేశం పార్టీ ఉండదని ఆయన జోష్యం చెప్పారు. పెద్ద నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, చర్చలు జరుగుతున్నాయని విజయసాయి బాంబు పేల్చారు. ఉప ఎన్నికల విషయంలో టీడీపీ ధర్మ విరుద్ధంగా వ్యవహరించింది కాబట్టే వైసీపీ అన్ని చోట్ల పోటీ చేస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
ఇంతకూ వైసీపీతో టచ్‌లో ఉన్న టీడీపీ పెద్ద నాయకులెవరనే చర్చకు తెరలేచింది. వైసీపీలో నెంబర్ 2గా పేరొందిన విజయ సాయిరెడ్డి ఊరికే చెప్పి ఉండరంటున్నారు. 2024లో కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందనే ప్రచారం ద్వారా ప్రత్యర్థులను బలహీనపరచ వచ్చనే ఎత్తుగడతో విజయసాయి వ్యూహాత్మకంగా ఫిరాయింపుల గురించి ప్రస్తావించారనే వాళ్లు లేకపోలేదు. ఇదిలా వుండగా లోకేశ్‌ను మరీ చులకన చేసి మాట్లాడ్డంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.