సోనూసూద్… కరోనా విపత్కర పరిస్థితుల్లో రియల్ హీరో. తన శక్తికి మించి అభాగ్యులకు, నిస్సహాయులకు ఆయన సేవలందించారు. దీంతో ఇలాంటి వాళ్లు పాలకులైతే ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయాలు దేశ వ్యాప్తంగా బలంగా విస్తరించాయి. ఈ నేపథ్యంలో సోనూసూద్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ రాజకీయాలపై ఆయన విముఖత వ్యక్తం చేస్తూ వచ్చారు.
తాజాగా రాజకీయాలపై సోనూసూద్ కీలక ప్రకనట చేశారు. తన సోదరి మాళవిక సూద్ రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సోనూసూద్ ప్రకటించారు. అయితే ఏ పార్టీ తరపున బరిలో నిలుస్తారో ఆయన స్పష్టం చేయకపోవడం గమనార్హం. సోనూసూద్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే….
‘మాళవిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత ఎవరూ శంకించలేనిది. రాజకీయాల్లోకి రావాలని జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. కేవలం సాధారణ సమావేశాలు మాత్రమే కాదు. ఇది పూర్తిగా సిద్ధాంతాలతో ముడిపడిన అంశం. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయంలో ప్రకటిస్తాం’ అని సోనూసూద్ ప్రకటించారు.
మాళవిక కాంగ్రెస్ లేదా ఆప్ తరపున బరిలో నిలుస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిని మాళవికతో కలిసి సోనూసూద్ కలిశారు. దీంతో కాంగ్రెస్ చేరుతారనే ప్రచారానికి బలం కలిగింది. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోనూ ఆయన ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే.
ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ‘దేశ్ కా మెంటార్స్’ అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ వ్యవహరిస్తున్నారు. దీంతో ఆప్‌లో మాళవిక చేరే అవకాశాలున్నాయనే ప్రచారాన్ని కొట్టి పారేయలేని పరిస్థితి. పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ మధ్యే తీవ్ర పోటీ అని సర్వేలు చెబుతున్నాయి.