న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో మహాపాదయాత్ర చేపట్టడంపై అనుకూల, వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌పై కొందరు నడక మొదలు పెట్టారు. ఈ పాదయాత్ర కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ రైతులు, మహిళల పేరుతో డ్రామా ఆడుతున్నారని వైసీపీ ఘాటు విమర్శలు చేస్తోంది.
తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాదయాత్ర నిర్వాహకులపై విరుచుకుపడ్డారు. అమరావతి రైతుల ముసుగులో నిబంధ నలకు విరుద్ధంగా టీడీపీ పాదయాత్ర చేస్తోందని మండిపడ్డారు. దమ్ముంటే టీడీపీ జెండా పట్టుకుని పాదయాత్ర చేయాలని ఆయన సవాల్ విసిరారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజల పూర్తి మద్దతుందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదే రీతిలో మంత్రి పేర్ని నాని కూడా ఇటీవల విమర్శలు చేశారు. మహాపాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్న విషయం బహిరంగ రహస్యమే అన్నారు. పాదయాత్రలో కనీసం టీడీపీ తన జెండాను పట్టుకోలేని దయనీయ స్థితికి దిగజారిందని ధ్వజమెత్తారు. ఇంతకంటే నీచం మరొకటి లేదని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు బాలినేని విమర్శల నేపథ్యంలో గుర్తు వస్తున్నాయి.