టీడీపీని ఓడించండి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓపెన్ లెటర్?

టీడీపీ అధ్యక్షుడు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. అనూహ్యంగా ఓ లేఖ కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరిట విడుదలైన ఆ లేఖలో అన్నీ నిజాలే ఉన్నాయి. టీడీపీని…

టీడీపీ అధ్యక్షుడు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. అనూహ్యంగా ఓ లేఖ కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరిట విడుదలైన ఆ లేఖలో అన్నీ నిజాలే ఉన్నాయి. టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలంటూ, కుప్పం ప్రాంతంలోని ఎన్టీఆర్ అభిమానులందర్నీ ఉద్దేశించి ఆ బహిరంగ లేఖను విడుదల చేశారు.

నిజంగా ఆ లేఖ ఎన్టీఆర్ అభిమాన సంఘం నుంచి వచ్చిందా లేక కావాలనే ఎవరైనా సృష్టించి విడుదల చేశారా అనే విషయాన్ని పక్కనపెడితే.. కుప్పంతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ లేఖ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. వాట్సాప్ లో విపరీతంగా వైరల్ అవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీని దూరం చేసిన ఘనత పూర్తిగా చంద్రబాబుదే. కొడుకు కోసం జూనియర్ ను దూరం పెట్టారు. తను అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేసినవాళ్లను అణగదొక్కారు. ఎన్టీఆర్ రాజకీయాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి లోకేష్, చంద్రబాబు చాలా చులకనగా మాట్లాడారు. చివరికి అధికారం కోల్పోయిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ జెండాలు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నా.. నినాదాలు వినిపిస్తున్నా చూసీచూడనట్టు జారుకుంటున్నారు తండ్రీకొడుకులు.

ఇప్పుడా ప్రభావం నేరుగా కుప్పం ఎన్నికల పైనే పడబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించిన, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అణగదొక్కిన తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దంటూ, సరిగ్గా పోలింగ్ కు 24 గంటల ముందు వాట్సాప్ ప్రచారం ఊపందుకుంది. ''అభిమాన సంఘం'' లేఖ కలకలం రేపుతోంది. చంద్రబాబు ఊహించని పరిణామం ఇది.

ఆ లేఖలో ఏముందో ఉన్నదున్నట్టు ఇక్కడ…

“జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల బహిరంగ లేఖ.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో జరిగే ఎన్నికల్లో ఆత్మాభిమానం కలిగిన అభిమానులుగా, మా అన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు విన్నపం. గత 2 సంవత్సరాలుగా కుప్పం గడ్డ మీద అన్న ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా, ఫ్లెక్సీలు కట్టకుండా మాపై ఉక్కుపాదం మోపిన వ్యక్తి ఈరోజు మున్సిపల్ ఛైర్మన్ గా, టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. నారా లోకేష్, 

మన అన్న జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించకుండా 2 సార్లు మనపై దాడి చేయించాడు. ఇప్పుడు గాయపడ్డ ప్రతి జూనియర్ అభిమానికి సమయం వచ్చింది. దెబ్బకు లోకేష్ పర్యటించిన అన్ని వార్డులు ఓటమి పాలుచేసి, మన ప్రతీకారం రుచి వాళ్లకు చూపిద్దాం. ఎన్టీఆర్ అభిమాని అనేవాడు దెబ్బతినడమే కాదు, తన సమయం వస్తే జీవితంలో లేవనంత దెబ్బ కొట్టగలడు అని చూపిద్దాం.. జై ఎన్టీఆర్.. కాబోయే ఏపీ భవిష్యత్తు.. యువత చేతిలో ఆయుధం. జై ఎన్టీఆర్”