వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరి నేర అంగీకార వాంగ్మూలం తీవ్ర దుమారం రేపుతోంది. దస్తగిరి వాంగ్మూలాన్ని ఆయుధంగా చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు.
వివేకా హత్య కేసుకు సంబంధించి ఇంత కాలం ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్టుగానే … దస్తగిరి వాంగ్మూలం ఇవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్‌ను టార్గెట్ చేసేందుకు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఓ సర్టిఫికెట్ అయ్యింది.
ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. వివేకానందరెడ్డిని చంపిందెవరో జగన్‌కు తెలుసన్నారు. చిన్నాన్న హత్యకు సంబంధించి అన్నీ తెలిసీ సీబీఐ విచారణ అంటూ జగన్ నాటకాలాడారని మండిపడ్డారు.
నాడు ప్రతిపక్ష నాయకుడిగా సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ చేసిన విషయాన్ని వర్ల గుర్తు చేశారు. ఆ తర్వాత సీఎం అయిన తర్వాత సీబీఐ విచారణపై వెనక్కి తగ్గారన్నారు.
అంతేకాదు, సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని వర్ల ప్రశ్నించారు. వివేకా హత్యకు రూ.40కోట్ల సుపారీ ఇచ్చిందెవరో జగన్‌కు తెలుసని వర్ల రామయ్య ఆరోపించారు.