కేసీఆర్ కు ఆడ గండం అంటే అర్థమేమిటి ? 

తన పార్టీలో పెద్ద నాయకులు, జనాదరణ ఉన్న నేతలు లేకపోయినా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ మీద గట్టిగానే కాలు దువ్వుతోంది. తెలంగాణలోని ప్రతిపక్షాలలో తన పార్టీ కూడా కీలకమైందేనని సంకేతాలిస్తోంది.…

తన పార్టీలో పెద్ద నాయకులు, జనాదరణ ఉన్న నేతలు లేకపోయినా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ మీద గట్టిగానే కాలు దువ్వుతోంది. తెలంగాణలోని ప్రతిపక్షాలలో తన పార్టీ కూడా కీలకమైందేనని సంకేతాలిస్తోంది. కీలక సమస్యలపైన పోరాటానికి తానూ సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. అదే విధంగా చేస్తోంది కూడా.

రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల తరపున పోరాడటానికేగానీ గమ్మున కూర్చోవడానికి కాదనే ధోరణిలో ఉంది. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ షర్మిల పార్టీని అంతగా పట్టించుకోకపోయినా ప్రభుత్వం మాత్రం ఆమె ఆందోళనకు దిగితే అడ్డంకులు కల్పిస్తోంది. ఆమె నిరాహార దీక్ష చేయడానికి సిద్ధం కాగానే అడ్డుకుంటోంది. 

అంటే ప్రభుత్వం షర్మిల పార్టీని ప్రతిపక్షంగా గుర్తించిందని అనుకోవాలా ? ఇప్పుడు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు రాజకీయం జోరుగా సాగుతోంది. హుజూరాబాద్  ఉప ఎన్నికలో గులాబీ పార్టీ ఓడిపోగానే అవమాన భారంతో కుంగిపోయిన కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు పేరుతో కేంద్రప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు.

కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ మోహరించాయి. ఇతర ప్రతిపక్షాల హడావిడి అంతగా లేకపోయినా షర్మిల వీరనారి అవతారం దాల్చి ముందుకు వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆమె పాదయాత్ర ఆగిపోవడంతో వరి ధాన్యం కొనుగోలు రాజకీయాన్ని అస్త్రంగా చేసుకుంది. 72  గంటల నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించింది. 

ధర్నా చౌక్ లో దీక్షకు పోలీసులు ఒక్కరోజే అనుమతి ఇచ్చారు. మిగిలిన దీక్షను లోటస్ పాండ్ లో చేయాలనుకున్నా పోలీసులు అనుమతించలేదని చెప్పింది. ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించింది. 72 గంటల దీక్షనే అనుమతించని పోలీసులు ఆమరణ దీక్షను ఎలా అనుమతిస్తారు ? ఆ విషయం షర్మిలకూ తెలుసు. ఈ సందర్భంగానే ఆమె కేసీఆర్ కు ఆడ గండం ఉందని కామెంట్ చేసింది. ఆడ గండం అంటే షర్మిల దృష్టిలో అర్ధం ఏమిటి ?

తన వల్ల కేసీఆర్ కు ముప్పు ఉందని చెప్పడమా ? ముప్పు అంటే అధికారంలోకి రావడమని అర్ధం చేసుకోవాలి. తనను చూసి కేసీఆర్ భయపడుతున్నాడని షర్మిల ఉద్దేశం. షర్మిల ఒక రాజకీయ నాయకురాలిగా నిలదొక్కుకోవడానికి ఇలాంటి పోరాటాలు దోహదం చేస్తాయేమోగానీ ఆమెను చూసి కేసీఆర్  భయపడేంత సీన్ ఉందా? తన నిరాహార దీక్షలను ప్రభుత్వం అడ్డుకుంటున్నదంటే తనను చూసి కేసీఆర్ భయపడుతున్నాడని షర్మిల భావిస్తోంది.

అందుకే కేసీఆర్ కు ఆడ గండం ఉందని అన్నది. ప్రతిపక్షాలు ఏ రూపంలో ఆందోళన చేసినా అణిచేయడం కేసీఆర్ నైజం. అందులో భాగంగానే షర్మిల నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఆ దీక్షకు అనుమతి ఇస్తే కేసీఆర్ వ్యతిరేక మీడియా దాని మీద దృష్టి పడుతుంది. ఆమెకు సానుభూతి  లభిస్తుంది. ఆ అవకాశం కేసీఆర్ ఎందుకు ఇస్తారు?