సురేష్ బాబుకు ఓ రూలు..నానికి మరో రూలు

టాలీవుడ్ లో అంతే..పెద్ద వాళ్లు తింటే ఫలహారాలు. చిన్నవాళ్లు తింటే చిరుతిళ్లు. పెద్దవాళ్లు ఏం చేసినా ఎవ్వరూ కిక్కురు మనరు. మీటింగ్ లు పెట్టరు. వీడియోలు చేయరు. ధ్వజమెత్తరు. అదే చిన్నవాళ్లు చేస్తే ఆగం…

టాలీవుడ్ లో అంతే..పెద్ద వాళ్లు తింటే ఫలహారాలు. చిన్నవాళ్లు తింటే చిరుతిళ్లు. పెద్దవాళ్లు ఏం చేసినా ఎవ్వరూ కిక్కురు మనరు. మీటింగ్ లు పెట్టరు. వీడియోలు చేయరు. ధ్వజమెత్తరు. అదే చిన్నవాళ్లు చేస్తే ఆగం ఆగం చేస్తారు.

కరోనా సెకెండ్ ఫేజ్ టైమ్. థియేటర్లు మూత పడి వున్నాయి. ఎప్పుడు తెరుస్తారో తెలియదు. తెరిచినా నూరుశాతం ఆక్యుపెన్సీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. దాదాపు నలభై కోట్ల పెట్టుబడి బ్లాక్ అయిపోయింది. టక్ జగదీష్ సినిమా పరిస్థితి ఇదీ. అప్పటికే హీరో నాని సినిమా ఒకటి ఓటిటికి ఇచ్చారు. దానికి నిర్మాత దిల్ రాజు. చాలా స్మూత్ గా పని జరిగిపోయింది.

టక్ జగదీష్ దగ్గరకు వచ్చేసరికి ఆగం ఆగం అయిపోయింది. ఎగ్జిబిటర్లు అంతా సమావేశం పెట్టారు. ఠాఠ్.ఢాం..ఢూం అన్నారు. హీరో నాని ని పర్సనల్ గా టార్గెట్ చేసారు. అక్టోబర్ వురకు వేచి వుండండి. థియేటర్లు తెరవకపోతే…''…థియేటర్లు అప్పటికీ తెరవకపోతే..'' ఓటిటికి ఇచ్చుకోండి అన్నారు. నిర్మాతకు వడ్డీల భారం పడిపోతోంది. తెగించి ఓటిటికి వెళ్లారు.

కట్ చేస్తే…

అదే సురేష్ బాబు భాగస్వామ్యం వున్న నారప్ప సినిమాను ఓటిటికి ఇచ్చేసారు. ఎవ్వరూ ఏమీ అనలేదు. అంతా గప్ చుప్. సరే కరోనా పరిస్థితులు కదా అని సరిపెట్టుకున్నారు. పెద్దాయిన కదా అని ఏమీ అనలేదు అనుకుందాం. 

ఇప్పుడు మళ్లీ…

దృశ్యం 2 సినిమా. మలయాళ రీమేక్. తక్కువ బడ్జెట్ సినిమా. నాని కన్నా సీనియర్ హీరో వెంకీ నటించిన సినిమా. టాలీవుడ్ పెద్దల్లో ఒక్కరైన సురేష్ బాబు భాగస్వామ్యం వున్న సినిమా. ఈ సినిమాను ఇప్పుడు ఓటిటి లో విడుదల చేస్తున్నారు. అదేంటీ అంటే..అక్టోబర్ వరకు వేచి వుండమన్నాం కదా..ఆ విధంగానే చేసారు తప్పేంటీ అనే వాదన వినిపిస్తున్నారు.

అప్పుడు చెప్పింది ఏమిటి? '' అక్టోబర్ వరకు చూడండి. అప్పటికీ పరిస్థితులు చక్కబడకపోతే ఓటిటికి వెళ్లండి'' అని. మరి ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి కదా? వరుసగా ప్రతివారం రెండు నుంచి నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. థియేటర్లు నూరుశాతం ఆక్యుపెన్సీ వచ్చింది. లవ్ స్టోరీ, బ్యాచులర్ లాంటి సినిమాలు మంచి కలెక్షన్లు కళ్ల చూసాయి. మరింకేంటీ సమస్య?

మరి ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఏమీ మాట్లాడరా? ఎందుకంటే నైజాంలో ఎక్కువ థియేటర్లు సురేష్ బాబు భాగస్వామ్యంలోనే లీజుకు వున్నాయి. అందువల్ల ఎగ్జిబిటర్లు అనేవాళ్లు అంతా ఆయన మనుషులే. ఇంక ఎవరేం మాట్లాడతారు. టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే.