ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి తాజాగా వెల్లడైన వాంగ్మూలం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన వైఎస్ జగన్ చిన్నాన్న కేసు కావడం, అందులో కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఒక నిందితుడు పేర్కొనడం కలకలం రేపుతోంది.
వివేకా హత్యపై ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి ఈ ఏడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో నేర అంగీకార వాంగ్మూలాన్ని ఇచ్చాడు. దాన్ని సీబీఐ అధికారులు రికార్డు చేశారు. ఈ వాంగ్మూలాన్ని శనివారం దస్తగిరి సహనిందితులకు అందజేశారు. ఇందులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వివేకా పొలం పనులు చూసే గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఉమా స్నేహితుడు సునీల్ యాదవ్, వివేకా మాజీ అనుచరుడు యర్ర గంగరెడ్డిలతో కలిసి తాను హత్యకు పాల్పడినట్టు దస్తగిరి అంగీకరించాడు.
ఇదే సందర్భంలో హత్య వెనుక పెద్దల హస్తం ఉన్నట్టు ఎర్రగంగిరెడ్డి తనకు చెప్పాడని, ఎవరా పెద్దలని తాను ప్రశ్నించారని దస్తగిరి పేర్కొన్నాడు. అందుకు సమాధానంగా వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, డి. శంకరరెడ్డి ఉన్నట్టు శంకర్‌రెడ్డి తనకు చెప్పాడని దస్తగిరి ప్రొద్దుటూరు మేజిస్ర్టేట్ ఎదుట వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నలుగురు కలిసి హత్య చేస్తే… కేవలం దస్తగిరి వాంగ్మూలాన్ని మాత్రమే హైలైట్ చేయడం ఏంటి? మిగిలిన ముగ్గురు నిందితులు సీబీఐకి లేదా కోర్టుకు ఇచ్చిన సమాచారం, వాంగ్మూలం ఏంటనే ప్రశ్నలు పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నాయి. దస్తగిరి చెప్పిన దానికి, మిగిలిన ముగ్గురు నిందితులు వెల్లడించిన విషయాలకు సంబంధం ఉందా? నలుగురూ ఒకే విషయం చెప్పారా లేక వేర్వేరు చెప్పారా?
దస్తగిరి మాత్రమే నేరాన్ని అంగీకరించి, మిగిలిన వాళ్లు ఒప్పుకోలేదా? దస్తగిరి నేర అంగీకార వాంగ్మూలంలో అంగీకరించినట్టు నిజమే అయితే మిగిలిన ముగ్గురి వాదన ఏంటి? దస్తగిరి చెబుతున్న దానికి, మిగిలిన వాళ్ల అభిప్రాయాలకు పొంతన ఉందా? దస్తగిరి మాత్రమే నేరాన్ని అంగీకరించి, మిగిలిన ముగ్గురు ఒప్పుకోకపోతే దాన్ని సీబీఐ ఎలా పరిగణిస్తుంది? దస్తగిరి వాంగ్మూలమే ఫైనల్ అవుతుందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ కేసులో మరిన్ని చిక్కుముడులు వీడితే తప్ప వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదని పలువురి అభిప్రాయం.