విశాఖలో ఇవాళ ఉదయం జనంతో ఒక్కసారిగా భయంతో రోడ్లపైకి పరుగు పెట్టారు. ప్రాణ భయం అంటే ఎలా వుంటుందో అనుభవం లోకి వచ్చింది. విశాఖ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 7.15 గంటలకు భూమి కంపించింది.
కొన్ని సెకన్ల పాటు భూమి వణికినట్టు నగరవాసులు చెబుతున్నారు. విశాఖ ఓల్డ్ టౌన్‌తో పాటు ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లో భారీ శబ్దం వచ్చినట్టు స్థానికులు ఆందోళనతో చెప్పడం గమనార్హం.
అలాగే నగరంలోని అక్కయ్యపాలెం, మధురానగర్, బీచ్‌రోడ్డు, తాటిచెట్లపాలెం, అల్లిపురం, ఆసిల్‌మెట్ట, సీతమ్మధార, గురుద్వారా, రైల్వేస్టేషన్, బీచ్ రోడ్డు, హెచ్‌బీకాలనీ, జ్ఞానాపురం, బంగారమ్మమెట్ట, సింహాచలం, అడవివరం, గోపాలపట్నం ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు అంటున్నారు.
భూకంపం దెబ్బతో ఇళ్లలోని వస్తువులు కిందపడ్డాయి. దీంతో భూకంపం వచ్చిందని గ్రహించి ఒక్కసారిగా బయటికి జనం పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో భవనాల శ్లాబ్ పెచ్చులు ఊడిపోయాయి. భూకంప తీవ్రత గురించి సంబంధిత శాస్త్రవేత్తలు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అక్కడ ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తే సునామీ ప్రమాదం పొంచి వుందని ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ ఎల్లో మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు వారి ప్రచారానికి ఊతం ఇస్తాయనడంలో సందేహం లేదు.