ఇవాళ దివంగత ఎన్టీఆర్ 27వ వర్ధంతి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆయన్ను స్మరించుకుంటున్నారు. అన్నదానాలు, రక్తదానాలు చేస్తున్నారు. ఇది నాణేనికి ఒక వైపు. ఇక రెండో వైపు ఏం జరుగుతున్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ భౌతికంగా మన నుంచి దూరమైనా, ఆయన మరణానికి దారి తీసిన పరిస్థితులు కళ్ల ముందు కదలాడుతున్నాయి.
చంద్రబాబు వెన్నుపోటు పొడవడాన్ని జీర్ణించుకోలేక, తీవ్ర మానసిక క్షోభకు గురై తుదిశ్వాస విడిచారనే అంశాన్ని నెటిజన్లు గుర్తు చేయడం గమనార్హం. ఇందుకు ఎన్టీఆర్ వర్ధంతిని సరైన రోజుగా భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ను సీఎం పీఠం మీద నుంచి గద్దె దింపిన చంద్రబాబు కూడా ఆయనకు ఘన నివాళులర్పించడాన్ని గుర్తించుకోవాలి. ట్విటర్ వేదికగా ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏమన్నారో మొదట తెలుసుకుందాం.
“మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన శకపురుషుడు ఎన్టీఆర్. ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా… తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా… జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు”
ఏది చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. ఎన్టీఆర్ చావుకు లోకమంతా నువ్వే కారణమని చెబుతున్నా, ఆయన మాత్రం పట్టించుకోరు. గతంలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.
“గొడ్డుకన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. నావెనకే ఉండి నమ్మించి వెన్నుపోటు పొడిచాడు. వాడి పేరు తలవటం కూడా నాకిష్టం లేదు. ఇలాంటి హీనుడు ఏ తల్లితండ్రులకి పుట్టకూడదు . తండ్రిని జైల్లో పెట్టించిన ఔరంగజేబు కంటే కూడా ఇతను ఇంకా పెద్ద మోసగాడు. మోసమే అతని నైజం. కాంగ్రెస్‌లో ఓడిపోయాక నా కూతురిని వెంటపెట్టుకొని వచ్చి కాళ్ళమీద పడితే కరుణించి స్థానమిచ్చాను. అప్పటి నుంచి గుంటనక్క లాగా ఎదురుచూసి ఇప్పుడు వెన్నుపోటు పొడిచాడు. చరిత్రహీనుడు, కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నన్నే మోసం చేసాడు. తెలుగు ప్రజలని తన టక్కుటమారా విద్యలతో మోసం చేస్తాడు. కాబట్టి తెలుగుప్రజలారా ఈ మోసగాడితో తస్మాత్ జాగ్రత్త !!”
చంద్రబాబుకు పిల్లనిచ్చిన మామ, రాజకీయ ఉజ్వల భవిష్యత్‌కు కారణమైన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెప్పిన కఠిన నిజాలు. తన గురించి ఎన్టీఆర్ దూషించినవి గుర్తు పెట్టుకుంటే రాజకీయంగా మనుగడ సాగించలేనని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే మనసులో ఎన్టీఆర్‌పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, పైకి మాత్రం పరమ భక్తుడిగా నటిస్తూ చంద్రబాబు నివాళులర్పించడం గమనార్హం.
ఏపీ రాజకీయ చరిత్రలో చంద్రబాబు అంటే మామకు వెన్నుపోటు పొడిచిన నాయకుడిగా భవిష్యత్ తరాలు తలుచుకుంటూనే వుంటాయి. ఎన్టీఆర్ దూషణలు నీడలా బాబును వెంటాడుతూనే వుంటాయి.