ఏపీ బీజేపీ సారథి సోము వీర్రాజుకు పదవీగండం పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. 2024 ఎన్నికలకు సోము వీర్రాజు సారథ్యంలో వెళ్లడం కంటె.. కొత్తగా అంతకంటె సమర్థుడైన నాయకుడి చేతిలో పగ్గాలు పెట్టడం మేలని పార్టీ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈనెల 24న జరిగే రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశంలో బహుశా సోమువీర్రాజు పదవికి సంబంధించి సూచనప్రాయంగా నిర్ణయం జరుగుతుందని కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన వారిని మరీ సుదీర్ఘంగా కొనసాగించడం అన్నది ఎన్నడో కానీ జరగదు. సాధారణంగా పార్టీ నిబంధనల ప్రకారం గడువు పూర్తయిన తర్వాత.. కచ్చితంగా సారథిని మార్చేస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎన్నికలకు సిద్ధం అవుతున్నప్పుడు మాత్రమే కొందరిని కొనసాగిస్తారు. 2019 ఎన్నికల సమయంలో అలాగే జరిగింది.
ఎన్నికలకు కొన్నాళ్ల ముందు అమిత్ షా పదవీకాలం ముగిసిపోగా.. ఎన్నికల వరకు దానిని కొనసాగించారు. ఆయన సారథ్యంలో పార్టీ ఘనవిజయం సాధించింది. ఎన్నికల తర్వాత.. జెపి నడ్డా చేతిలో పగ్గాలు పెట్టారు. ఇప్పుడు జెపి నడ్డా పదవీకాలం కూడా పూర్తయింది. అయితే ఇటీవలి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడి గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. జెపి నడ్డానే కొనసాగించదలచుకున్నారు. ఎన్నికల వరకు ఆయనను ఉంచదలచుకన్నారు. అయితే జాతీయ అధ్యక్షుడి విషయంలో జరిగిన ఆ మ్యాజికల్ నిర్ణయం ఏపీ అధ్యక్షుడి విషయంలో ఉండకపోవచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి.
సమర్థత పరంగా సోము వీర్రాజు మీద పెద్ద సదభిప్రాయం ఏమీ పార్టీ అధిష్ఠానానికి ఆయన పదవీకాలంలో ఏర్పడలేదు. ఇటీవల మోడీతో విశాఖలో సమావేశం సందర్భంగా ప్రధాని.. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అని అడిగితే.. చెప్పడానికి సోము వీర్రాజు తడబడడం ఒక కామెడీ అయిపోయింది. దో అప్పట్లో కాపు సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోవం కోసం సోము చేతిలో పదవి పెట్టారు. కానీ.. ఆ పరంగా కూడా ఆయన సాధించిందేమీ లేదు. ఆయన సారథ్యంలో వచ్చే ఎన్నికలకు పొత్తులతో వెళ్లినా, ఒంటరిగా వెళ్లినా ఒరిగేదేమీ ఉండదని పలువురు పార్టీ వారే అంటున్నారు.
ఇలాంటి నేపథ్యంలో సోము వీర్రాజును మార్చి మరొక సమర్థుడైన నాయకుడి చేతిలో పగ్గాలు పెడతారని అంటున్నారు. ఇదివరకు కన్నా లక్ష్మీనారాయణను మార్చి అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు చేతిలో పదవి పెట్టారు. ఈసారి కొత్త అధ్యక్షుడి ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం దక్కవచ్చునని, తద్వారా పార్టీ బీసీల్లో ఇమేజి పెంచుకోవడం జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.