లోకేష్ పెద్దరికాన్ని అంగీకరించిన గంటా

చంద్రబాబుది నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర. పైగా వయసులోనూ ఆయన పెద్దవారు. సీనియర్ పొలిటీషియన్. ఆయన విషయంలో పార్టీలో సీనియర్ నేతలు ఎన్ని అనుకున్నా గౌరవం ఇస్తూంటారు. బాబు ఒక మాట అన్నా…

చంద్రబాబుది నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర. పైగా వయసులోనూ ఆయన పెద్దవారు. సీనియర్ పొలిటీషియన్. ఆయన విషయంలో పార్టీలో సీనియర్ నేతలు ఎన్ని అనుకున్నా గౌరవం ఇస్తూంటారు. బాబు ఒక మాట అన్నా ఓకే అనుకుంటారు.

కానీ బాబు గారి సోలో వారసుడిగా వచ్చి పార్టీలో తాను పుట్టకముందు నుంచి ఉన్న పెద్దల మీద లోకేష్ పెత్తనం చేస్తున్నారు అని తెలుగుదేశంలో సీనియర్లు మధనం చెందుతూ ఉంటారని ప్రచారంలో ఉన్న మాట. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా చంద్రబాబు అంటే తనకు గౌరవం అని చెబుతూ ఉంటారు.

అలాంటి ఆయన విశాఖ లోకేష్ వస్తే కలిసింది లేదు. ఆయనకు లోకేష్ జూనియర్ అన్న భావన ఉంటూండేది అని ప్రచారంలో ఉన్న మాట. అలాంటి లోకేష్ ని ఇటీవల కలసి గంటా అందరినీ ఆశ్చర్యపరచారు. లోకేష్ ప్రాధాన్యత పార్టీలో అమాంతం పెరిగిపోతోంది. ఇక అనివార్యం అయిన నేపధ్యంలో గంటా కలిశారు అని అంతా అనుకున్నారు.

తాజాగా లోకేష్ ని కలిసిన దాని మీద మీడియాతో గంటా మాట్లాడుతూ చినబాబుని కలవడంలో ఆంతర్యం ఏమీ లేదు అని చెప్పుకున్నారు. చంద్రబాబు,లోకేష్ ఇద్దరు తెలుగుదేశం కుటుంబ పెద్దలు అంటూ ఆయన మాట్లాడారు. తమ కుటుంబ పెద్దలను కలవడం సర్వసాధారణం అని ఆయన అంటున్నారు.

ఇన్నాళ్లూ తాను పార్టీలో యాక్టివ్ గా ఉండలేకపోవడానికి కారణం కోవిడ్ తప్ప నేరం తనది కాదు అని చెబుతున్న గంటా ఇక మీదట గంట గణగణ మోగించేస్తాను అంటున్నారు. ఈ విషయాలు ఎలా ఉన్నా లోకేష్ పెద్దరికాన్ని గంటా ఎట్టకేలకు అంగీకరించడమే అసలైన విశేషం అని పార్టీలోని ఆయన ప్రత్యర్ధుల నుంచి వినిపిస్తున్న మాట. 

లోకేష్ బాబు ఏది చెబితే అది చేయడానికి గంటా తయారుగా ఉన్నారనే అనుకోవాలి. విశాఖ జిల్లాలో లోకేష్ ని ఇప్పటికే మరో మంత్రి అయ్యన్నపాత్రుడు భుజానకెత్తుకున్నారు.  ఇపుడు గంటా తోడు అయ్యారు. చినబాబు ఎవరికి ఓటేస్తారో, ఎవరికి ప్రాధాన్యత ఇస్తారో రానున్న కాలంలో తేలుతుంది.