గత కొన్నేళ్లుగా భాజపా భక్తులు అనేక పోచికోలు అంశాల గురించి కూడా స్పందిస్తూ వస్తున్నారు. సినిమాలు, పాటలు, బికినీల రంగులు వీటిని కూడా వదలరు. తమకు నచ్చని వారు ఏం చేసినా తప్పే అన్నట్టుగా మారింది వ్యవహారం. అలాగే బాయ్ కాట్ పిలుపులు కూడా ఈ మధ్య రొటీనే! ఈ బాయ్ కాట్ పిలుపులను ప్రజలు పట్టించుకోకపోయినా భక్తులు మాత్రం వాట్సాప్ యూనివర్సిటీని ఇలా విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటారు.
ఇలాంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూక్ష్మాన్ని బోధించినట్టుగా తెలుస్తోంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దంటూ మోడీ ప్రబోధించినట్టుగా తెలుస్తోంది.
పార్టీ బలోపేతం గురించి దృష్టి పెట్టాలి కానీ, లేని పోని అంశాల గురించి స్పందించి వ్యర్థకార్యకలాపాలకు పాల్పడవద్దని మోడీ పార్టీ కార్యవర్గానికి తెలియజేసినట్టుగా తెలుస్తోంది. మరి మోడీ హితబోధ తర్వాత భక్తులు, బీజేపీ అత్యుత్సాహ నేతలు ఇలాంటి అంశాల గురించి అతిగా స్పందించడం ఆగుతుందేమో వేచి చూడాల్సి ఉంది.
ఇక మైనారిటీలకూ, గిరిజన వర్గాలకు బాగా చేరువ కావాలంటూ కూడా మోడీ తన ప్రసంగంలో సూచించారు. ప్రత్యేకించి సిక్కుల్లో పట్టు పెంచుకోవాలని, అలాగే వివిధ రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్న గిరిజనులకు కూడా చేరువ కావాలంటూ మోడీ భారతీయ జనతా పార్టీ కార్యవర్గానికి సూచించారు తన ప్రసంగంలో.