కొత్త ఏడాదిలో మరో ఎన్నికల సమరంగణానికి తెరలేచింది. అయితే ఈ సారి మూడు బుల్లి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసింది. దాని ప్రకారం త్రిపుర ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుంది. మేఘాలయ, నాగాలాండ్ లలో ఫిబ్రవరి 17న పోలింగ్ జరగనుంది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి రెండున విడుదల చేయబోతున్నట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఈ మూడు రాష్ట్రాల్లోనూ మార్చి రెండో వారంతో ప్రభుత్వాల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సీఈసీ రెడీ అవుతోంది. మరో నెల రోజుల్లో ఈ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిల్లో ఈ మూడు బుల్లి రాష్ట్రాలున్నాయి.
మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ చొప్పున అసెంబ్లీ సీట్లున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ కలిపి 62 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
ఇక ఈ రాష్ట్రాలతో పాటు మిజోరం, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీలకు కూడా ఈ ఏడాదే ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు నిర్వహించగలిగితే జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించవచ్చు ఈ ఏడాదిలోనే.