ఇది సోషల్ మీడియా యుగం. ఒకప్పటిలా నందమూరి లక్ష్మిపార్వతి ఒంటరి కాదు. న్యాయం వైపు, అభాగ్యురాలి వైపు నిలబడడానికి మానవతావాదులు, బుద్ధి జీవులు ఏ మాత్రం సంకోచించడం లేదు. తప్పుల్ని నిలదీయడానికి, బరితెగింపును ప్రశ్నించడానికి ఎంతో మంది సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకున్నారు. బుధవారం ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి కొత్త కోణంలో వివిధ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.
మోహన్‌బాబు అనే సాహిత్యకారుడు పెట్టిన పోస్టుపై ఆసక్తికర చర్చకు తెరలేచింది. ఓ వామపక్ష సిద్ధాంతకర్త లక్ష్మిపార్వతిని తప్పు పెడుతూ కామెంట్స్ చేయగా, ప్రసిద్ధ జర్నలిస్టు తాడి ప్రకాశ్ తనదైన భాషలో చురకలు అంటించడం గమనార్హం. ఆ సంగతులేంటో తెలుసుకుందాం.
“రెండో భార్య బూచిని చూపించి, కొడుకులూ, కూతుళ్లూ, అల్లుళ్ల చేత మూకుమ్మడిగా హత్యకు గురైన వారిలో ఆధునిక చరిత్రలో ఆయన ఒక్కడేనేమో!” అని మోహన్‌బాబు అనే సృజనకారుడు పోస్టు పెట్టారు. ఈయన పోస్టుపై నరసింహారావు అనే కమ్యూనిస్టు సిద్ధాంతకర్త స్పందిస్తూ…
“రెండవ పెళ్ళాం వల్ల సర్వం కోల్పోయిన నాయకుడు దేశంలో అతనొక్కడే!” అంటే జరిగినదాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ రోజుల్లో లక్ష్మీపార్వతి చేసిన (మొహన్‌బాబు, నెహ్రూ, dr అనీల్ etcల సహకారంతో) అరాచకం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ ని అన్నిరకాలుగా భ్రష్టుపట్టించింది. అలా నిజ జీవితంలోకూడా ఎన్టీఆర్ జీవిత చరిత్రకు లక్ష్మీపార్వతి ముగింపు రాసింది. ఈ విషయంలో ఎన్టీఆర్ కంటే దురదృష్టవంతుడు దేశంలోనే లేడు (లేకపోతే సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ లక్ష్మీపార్వతికి పడిపోవటం ఏమిటి?!)” అని కామెంట్ రాసుకొచ్చారు. ఈ కామెంట్‌పై ప్రసిద్ధ జర్నలిస్ట్ తాడి ప్రకాశ్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే…
“ఎంత అమర్యాదగా అన్నారు! పడిపోవడమా! ఎన్టీఆర్ ఎవరితో ఉండాలి, ఎవర్ని పెళ్లి చేసుకోవాలి అనేది మీరు, రామోజీ రావు, చంద్రబాబు నిర్ణయిస్తారా? Sheer arrogance. ఏం చూసి చేసుకున్నాడు లక్ష్మీ పార్వతిని అని ఐ. వెంకట్రావ్ కూడా రాశారు. మనం ఎవరం డిసైడ్ చేయడానికి” అని రాతలతో వాతలు పెట్టారు.