మొన్నటివరకు కొంతమంది పేర్లు మాత్రమే చెప్పింది. మరికొంతమందిపై పరోక్షంగా విమర్శలు చేసింది. ఈసారి మాత్రం కంగనా రనౌత్ ఫుల్ గా ఓపెన్ అయిపోయింది. తను ఎవ్వర్ని తిట్టాలనుకుంటోందో వాళ్ల పేర్లు పెట్టి మరీ తిడుతోంది. ఈసారి కంగనా ఆరోపణల్లో ప్రత్యేకత ఏంటంటే.. ఆమె చేసే ప్రతి ఆరోపణను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేస్తోంది.
బాలీవుడ్ లో 99శాతం మంది హీరోలు డ్రగ్స్ కు బానిసలంటూ సంచలన ఆరోపణలు చేసిన ఈ నటి, ఈసారి ఏకంగా కొంతమంది పేర్లను ప్రస్తావించింది. దయచేసి వాళ్లు తమ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని, డ్రగ్స్ తీసుకున్నారో లేదో తేలిపోతుందంటూ సవాల్ విసిరింది.
“రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్, అయన్ ముఖర్జీ, విక్కీ కౌశిక్ ను నేను కోరుతున్నాను, మీరు మీ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వండి. డ్రగ్ టెస్ట్ చేయించుకోండి. వీళ్లంతా కొకైన్ కు బానిసలయ్యారనే పుకార్లు ఉన్నాయి. ఈ పుకార్లను తప్పని నిరూపించుకోండి. డ్రగ్ టెస్ట్ లో క్లీన్ అని తేలితే కొన్ని లక్షల మందికి ఈ హీరోలు స్ఫూర్తిగా నిలుస్తారు.”
ఇలా పేర్లు పెట్టి మరీ ఆరోపణలు చేసింది కంగనా. బాలీవుడ్ హై-ప్రొఫైల్ పార్టీల్లో, టాప్ హీరోల ఇన్నర్ సర్కిల్స్ లో అత్యంత ఖరీదైన డ్రగ్స్ వాడతారని.. అలాంటి పార్టీలకు అందరికీ ఆహ్వానాలు అందవని ఆరోపించింది కంగన. 99శాతం మంది సూపర్ స్టార్లు డ్రగ్స్ కు బానిసలని దానిక తను గ్యారెంటీ అని అంటోంది. మరోవైపు కరణ్ జోహార్, ఆదిత్య చోప్రాపై మరోసారి విరుచుకుపడింది.
“కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్, రాజీవ్ మసంద్.. వీళ్లతో పాటు రక్తం తాగే మరికొంతమంది మీడియా మాఫియా అంతా కలిసి సుశాంత్ ను చంపేశారు. ఆ కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క కొడుకును చంపేసిన కరణ్ జోహార్.. ఇప్పుడు తన కిడ్స్ ను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డాడు.”
శృతిమించుతున్న కంగన ఆరోపణల్ని ఇప్పటికే చాలామంది నెటిజన్లు తప్పుపడుతున్నారు. మరికొంతమంది విసుక్కుంటున్నారు. ఇప్పుడు ఆమె ఏకంగా పీఎంవో ఆఫీస్ ను కూడా ట్యాగ్ చేయడాన్ని చాలా మంది ఖండిస్తున్నారు. ఆ కార్యాలయానికి ఓ గౌరవం ఉందని, ప్రతి ఒక్క విషయాన్ని దానికి ట్యాగ్ చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. కంగనా మాత్రం తను చేసినదాంట్లో తప్పేముందని రివర్స్ లో ప్రశ్నిస్తోంది.