సరిహద్దుల్లో చైనా ట్రూప్స్ కదలికలకు అనుగుణంగా ఇండియాలో చైనీ యాప్స్ పై నిషేధాజ్ఞలు కొనసాగుతూ ఉన్నాయి. చైనాతో ఉద్రిక్తలు, గాల్వాన్ లోయలో భారత సైనికుల మరణం పరిస్థితుల్లో కొన్ని ప్రముఖ చైనీ స్మార్ట్ ఫోన్ యాప్స్ పై మోడీ ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించిన సంగతి తెలిసిందే.
టిక్ టాక్ తో సహా, యూసీ బ్రౌజర్ తదితర ప్రముఖ స్మార్ట్ ఫోన్ యాప్స్ అప్పుడు నిషేధం అయ్యాయి. వాటి యాజమాన్యాలు ఇండియాలో తమ యాక్టివిటీస్ పై ఆశలు వదిలేసుకుని చైనా కు చేరిపోయాయి. తాజాగా మరోసారి సరిహద్దుల్లో చైనా అభ్యంతరకరంగా వ్యవహరించి ఉద్రిక్తతలను రేపింది. ఈ క్రమంలో మరో 118 చైనీ స్మార్ట్ ఫోన్ యాప్స్ పై కేంద్రం నిషేధం విధించింది.
వీటిల్లో పాపులర్ గేమ్ యాప్ పబ్జీ కీలకమైనది. మొదటి విడతలోనే చైనాకు సంబంధించి ప్రముఖ యాప్ లను నిషేధించారు. ఈ విడతలో చిన్న చిన్న చైనీ యాప్స్ ను ఏరేశారు.
పబ్జీ నిషేధంపై డిమాండ్ ఇప్పటిది కాదు. ఆ గేమ్ కు అడిక్ట్ అయిన వారు హింసాత్మక ప్రవృత్తితో వ్యవహరించడంపై వార్తలు వచ్చాయి. అప్పుడే దాన్ని నిషేధించాలనే డిమాండ్ వినిపించింది. అయితే అప్పుడు జరగలేదు. ఇప్పుడు అది సాధ్యమైనట్టుంది.