దేశంలో తమకు ఎదురే లేదని అనుకుంటున్న ప్రస్తుత తరుణంలో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీని ఒకే ఒక్కటి కలవరపడేలా చేస్తోంది. అదే డిస్‌లైక్. ఇప్పుడీ మాట మోడీ సర్కార్‌కు చాలా అప్రియమైంది. గత నెలాఖరులో ప్రధాని మోడీ ప్రతి నెలా మన్ కీ బాత్ అంటూ జాతినుద్దేశించి ప్రసంగించే విషయం తెలిసిందే.
గత ఆగస్టు నెలకు సంబంధించి 30వ తేదీన ఆయన మాట్లాడారు. మోదీ ‘మన్ కీ బాత్’ వీడియో దేశ వ్యాప్తంగా అత్యధిక డిస్‌లైకులు సాధించిన వీడియోల్లో ఒకటిగా నిలిచింది. ఇదే బీజేపీని ఆందోళనకు గురి చేస్తోంది.
మన్ కీ బాత్‌లో దేశీయంగా ఆట బొమ్మల తయారీని భారీగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దేశీయ బొమ్మలే కాదు, దేశీయ జాగిలాల వృద్ధికీ పని చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భూకంపాలు, ప్రకృతి విపత్తుల సమయంలోనూ శునకం అవసరం ఎంతో ఉందన్నారు. భద్రతా దళాలన్నీ దేశవాళీ కుక్కల్ని స్క్వాడ్‌గా తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రజలంతా కుక్కల్ని పెంచాలని…ఇలా సాగింది ప్రధాని మోడీ ప్రసంగం.
ప్రధాని హోదాలో కుక్కల్ని, నక్కల్ని పెంచాలని పిలుపునివ్వడం ప్రజలకు సిల్లీగా కనిపించాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రధాని చెబితే…దేశమంతా దీపాలు వెలిగించడం, చప్పట్లు కొట్టడం తదితర యాక్టివిటీస్‌లో పాల్గొన్నారు. దీంతో తానేం చెప్పినా జనమంతా వెర్రి గొర్రెల్లా తలలూపుకుంటూ…చేస్తారని భావించిన ప్రధానికి నెటిజన్లు షాకిచ్చారు. కరోనాతో ఉద్యోగులు, ఉపాధి పోగొట్టుకున్న నిరుద్యోగులకు ఏవైనా బతుకుతెరువు మార్గాలు చెబుతారనుకుంటే…మోడీ ఇలా చెబుతున్నారేంటి? అని చిర్రెత్తుకొచ్చి తమ నిరసనను డిస్‌లైక్ రూపంలో వ్యక్తం చేశారు.
ఆగస్టు నెల ‘మన్ కీ బాత్’ కార్యక్రమ వీడియోను భారతీయ జనతా పార్టీ అధికారిక యూట్యూబ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. సహజంగా మోడీకి సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉంది. ఆయన వీడియోలకు, పోస్టింగ్‌లకు భారీగా లైక్‌లు వస్తుంటాయి. ఈ దఫా మాత్రం అందుకు పూర్తి రివర్స్‌లో నెటిజన్ల నుంచి అటాక్ ఎదురైంది. మన్ కీ బాత్ వీడియోకు గతంలో ఎన్నడూ లేనంతగా డిస్‌లైకులు రావడం బీజేపీని పునరాలోచనలో పడేసింది.
భారతీయ జనతా పార్టీకి చెందిన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో 10 లక్షల డిస్‌లైకులతో సరికొత్త రికార్డు సృష్టించింది. బీజేపీకి నెటిజన్లు దిమ్మ తిరిగేలా చేశారు. ప్రధాని అయినంత మాత్రాన కుక్కలు, నక్కల పెంపకం గురించి చెబుతుంటే…వినడానికి పిచ్చివాళ్లు కాదనే అభిప్రాయాన్ని నేరుగా వ్యక్తం చేసినట్టైంది. బీజేపీ యూట్యూబ్ చానల్‌తో పాటు పీఎంవోఇండియా, నరేంద్రమోదీ యూట్యూబ్ చానళ్లలో కూడా ఈ వీడియోను షేర్ చేశారు.అక్కడ కూడా లైకుల కంటే డిస్ లైకులే ఎక్కువ రావడం గమనార్హం.
పీఎంవో ఇండియా యూట్యూబ్‌లో కామెంట్లు కనిపించకుండా టర్న్ ఆఫ్ చేశారు. ఇది మరింతగా తీవ్ర విమర్శలకు దారి తీసిందని చెప్పొచ్చు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీకి పల్లకీలు మోసే మీడియా ఉండడంతో….ఇంత కాలం ప్రతికూలత అంటే ఏంటో ఆయనకు తెలిసి రాలేదు. మొదటిసారిగా నెటిజన్ల వ్యతిరేకత చూసి బీజేపీ వెన్నులో వణుకు పుట్టింది.
‘సడక్-2’ అనే సినిమా ట్రైలర్ తర్వాత అత్యధిక డిస్‌లైక్‌లతో మోదీ ‘మన్ కీ బాత్’ వీడియో రికార్డులకెక్కింది. ఇప్పటికైనా ప్రధాని మోడీ కబుర్లు చెప్పడం మాని…ప్రజలకు పనికొచ్చే పనులు చేయడం స్టార్ట్ చేయాలి.