పదేళ్ల నుంచి టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం నడుస్తోందని, దానిపై పోలీసులు ఓ కన్నేసి ఉంచితే బాగుంటుందని సంచలన ఆరోపణలు చేసింది ఒకప్పటి హీరోయిన్ మాధవీలత. దీనిపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు సీరియస్ అయ్యారు. ఆరోపణలు చేసేముందు ఆధారాలు కూడా చూపించాలన్నారు.
నిజంగా డ్రగ్స్ వాడకంపై ఆధారాలు ఏమైనా ఉంటే పోలీసులకు ఇవ్వాలని మాధవీలతకు సూచించింది ఎక్సైజ్ డిపార్ట్ మెంట్. డ్రగ్స్ వాడకం విషయంలో చాలా కఠినంగా ఉంటున్నామని, నిజంగా ఈమధ్య కాలంలో మాధవీలతకు అలాంటి ఘటనలు ఏమైనా ఎదురైతే, ఆధారాలు ఇవ్వాలని కోరారు.
ఐదేళ్ల కిందట తను కొన్ని పార్టీలకు ఎటెండ్ అయ్యానని, అప్పుడు అక్కడ డ్రగ్స్ వాడకాన్ని చూశానని మాధవీలత కొన్ని మీడియా ఛానెల్స్ కు చెప్పడాన్ని తప్పుపట్టింది ఎక్సైజ్ శాఖ. ఐదేళ్ల కిందట పార్టీలకు వెళ్తే అప్పుడే చెప్పాలని, ఇప్పుడు కాదని అన్నారు. టాలీవుడ్ లో డ్రగ్స్ కు సంబంధించి 3 రోజుల కిందట ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన మాధవీలత.. ఆ వెంటనే వరుసగా న్యూస్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు.
పదేళ్ల కిందట టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ బయటపడిందని.. అప్పట్లో అరెస్టులు చేయకుండా.. కీలకమైన పోలీస్ అధికారుల్ని ట్రాన్సఫర్ చేశారంటూ ఆరోపణలు చేశారు. వీటిని తెలంగాణ ఎక్సైజ్ శాఖ పోలీసులు ఖండించారు. పోలీస్ డిపార్ట్ మెంట్ ఆరోపణల ఆధారంగా పనిచేయదని, సాక్ష్యాల ఆధారంగా పనిచేస్తుందని ప్రకటించారు.
3 రోజుల కిందట టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకంపై మాధవీలత పెట్టిన పోస్టు లో ఓ చిన్న భాగం ఇది..
“తెలంగాణ NCBసార్లు మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి పీతకన్నూ కాకుండా సీరియస్ కన్ను వేయండి . మన ఇండస్ట్రీ లో బాగా వాడుకలో ఉంది అది లేకుండా కొన్ని పార్టీ లు జరగవు ఇక్కడ 2009 లో వచ్చారు . పొలిటికల్ అండ తో వెనక్కి పోయారు పాపం డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి Other Department కి పడేసారు చట్టానికి చేతులు చాల పెద్దవి అందుకే అవి చాచితే విరగొడతారు చాల దారుణాలు జరుగుతున్నాయి మత్తులో.”