ప‌వ‌న్‌ను వెంటాడుతున్న భ‌యం

మనిషి ఆలోచ‌న‌లే జీవితం అని మాన‌సిక శాస్త్ర‌వేత్త‌లు చెబుతారు. ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే అత‌ని లేదా ఆమె జీవితం నిర్మిత‌మ‌వుతుంది. ఇది రాజ‌కీయాల‌కు కూడా వ‌ర్తిస్తుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగంగా చెబుతున్న‌ట్టు అత‌ను ధైర్య‌ప‌రుడు కాదు.…

మనిషి ఆలోచ‌న‌లే జీవితం అని మాన‌సిక శాస్త్ర‌వేత్త‌లు చెబుతారు. ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే అత‌ని లేదా ఆమె జీవితం నిర్మిత‌మ‌వుతుంది. ఇది రాజ‌కీయాల‌కు కూడా వ‌ర్తిస్తుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగంగా చెబుతున్న‌ట్టు అత‌ను ధైర్య‌ప‌రుడు కాదు. ప‌వ‌న్‌లో పిరికిత‌నం భాగ‌మైంది. ముఖ్యంగా అప‌న‌మ్మ‌కం, స్థిర‌త్వం లేక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాలు రాజ‌కీయంగా ఎద‌గ‌క‌పోవ‌డానికి అడ్డంకిగా మారాయి.

త‌నంటే ప్రాణాలిచ్చే వేలాది మంది అభిమానుల న‌మ్మ‌కం, ప్రేమ ప‌వ‌న్‌కు ధైర్యాన్ని ఇవ్వ‌లేక‌పోతున్నాయి. అదేంటోగానీ, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పిలుచుకునే  చంద్ర‌బాబు, ఎంతో న‌మ్మ‌క‌స్తుడైన నాయ‌కుడిగా ప‌వ‌న్‌కు క‌నిపించారు. పోయే కాలం దాపురిస్తున్న‌ప్పుడే ఇలాంటివి చోటు చేసుకుంటాయేమో అని జ‌న‌సేన నేత‌లు స‌రిపెట్టుకోవాల్సి వుంటుంది. పార్టీ శ్రేణుల‌కి భ‌విష్య‌త్‌పై న‌మ్మ‌కాన్ని క‌లిగించాల్సిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆ ప‌ని చేయ‌కుండా మ‌రింత నిరుత్సాహ ప‌రిచారు. ఇందుకు శ్రీ‌కాకుళం జిల్లాలోని ర‌ణ‌స్థలంలో జ‌రిగిన యువ‌శ‌క్తి స‌భ వేదికైంది.

ఒంట‌రిగా పోటీ చేయ‌మంటారా? అని ప‌వ‌న్ ప్ర‌శ్న‌కు… చేయాల‌ని ఎదురుగా ఉన్న జ‌న‌సైనికులు గ‌ట్టిగా అరిచి, చేతులు ఊపుతూ మ‌రీ చెప్పారు. అబ్బే, ఇవేవీ ఆయ‌న‌కు ధైర్యాన్ని ఇవ్వ‌లేదు. మిమ్మ‌ల్ని న‌మ్ముకుని గతంలో మునిగిపోయాన‌ని, మ‌ళ్లీమ‌ళ్లీ వీర‌మ‌ర‌ణం పొంద‌లేన‌ని ఏవో సాకులు చెప్పారు. చివ‌రికి త‌న‌కు చంద్ర‌బాబు అంటేనే ఎంతో న‌మ్మ‌కం అని ప‌రోక్షంగా పొత్తు ప్ర‌స్తావ‌న తెచ్చారు.

గ‌తంలో రెండు చోట్ల ఓడిపోయిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు, ఆ పీడ‌క‌ల వెంటాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ద‌ఫా కూడా పార్టీ అధినేత‌గా ఓడిపోతే ఇక పుట్ట‌గ‌తులుండ‌వ‌ని ఆయ‌న నిలువెల్లా వ‌ణికిపోతున్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై జ‌నంలో తీవ్ర వ్య‌తిరేక‌త వుంద‌ని చెబుతూనే, పోలింగ్ బూత్‌ల‌కు వెళితే ఆయ‌న‌కే ఓట్లు వేస్తార‌ని అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌పై ఆయ‌న నిష్టూర‌మాడారు. స‌భ‌లు, స‌మావేశాల‌కు జ‌నం రావ‌డానికి, ఓట్లు వేయడానికి తేడా వుంద‌నే వాస్త‌వాన్ని ఆయ‌న ఆల‌స్యంగానైనా గ్ర‌హించారు.

జ‌నానికి న‌మ్మ‌కాన్ని క‌లిగించేలా త‌న రాజ‌కీయ పంథా వుండ‌డం లేద‌నే వాస్త‌వాన్ని ప‌వ‌న్ ఇంకా గుర్తించ‌డం లేదు. జ‌గ‌న్‌ను గ‌ద్దె దించాల‌నే మాట ప‌క్క‌న పెడితే, ఆయ‌న త‌క్ష‌ణ రాజ‌కీయ అవ‌స‌రం ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం. ఒంట‌రిగా పోటీ చేస్తే ఓడిపోతానేమో అనే భ‌యం అన్ని విలువ‌ల‌ను విడిచిపెట్టేలా చేస్తోంది. 

ఎన్నిక‌ల్లో గెలవ‌డం త‌ప్ప‌, మ‌రే విమ‌ర్శ‌లను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. చంద్ర‌బాబుతో గ‌తంలో ఎన్ని వైరాలున్నా, గెల‌వ‌డం కోసం ఆయ‌న‌తో జ‌త క‌ట్టాల్సిన దుస్థితిని చేజేతులా త‌నే తెచ్చుకున్నారు. పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోని కార‌ణంగా ప‌వ‌న్ జ‌నానికి చేరువ కాలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో టీడీపీకి సాగిల‌ప‌డే ప‌రిస్థితి. భ‌య‌మే అన్ని అన‌ర్థాల‌కు కార‌ణం ఎలా అవుతుందో ప‌వ‌న్‌ను చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది.