తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తనయుడు బండి సాయి భగీరథ్‌పై ర్యాగింగ్ కేసు నమోదైంది. ఒక విద్యార్థిపై బండి భగీరథ్ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో బండి సంజయ్ కొడుకు విద్యార్ధిని కొడుతున్నా బండి సంజయ్ దానిని రాజకీయం చేయవద్దంటూ హితవు పలికారు.
చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దని.. దెబ్బలు తిన్న విద్యార్ధి ఫిర్యాదు చేశాడా లేక, వేధింపులకు గురైన విద్యార్థిని ఫిర్యాదు చేసిందా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. తన కొడుకుని తానే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తానని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా.. లేక లాఠీలతో కొడతారా..? ఏం చేస్తారో చూస్తాం అంటూ వ్యాఖ్యానించారు. చదువుకునే పిల్లలు కొట్టుకుంటారు, ఆ తర్వాత కలిసిపోతుంటారని, ఇందులో కేసీఆర్‌కు వచ్చిన నొప్పేంటని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు ఏవైనా జరిగితే ముందు విద్యార్థి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేయాలని, అలాంటివి చేయకుండా నేరుగా క్రిమినల్ కేసులు పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసని అన్నారు.
ఇప్పటికే దెబ్బలు తిన్న విద్యార్థి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. భగీరథ తనకు మంచి ఫ్రెండ్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, పాత వీడియోను ఇప్పుడు ఎందుకు బయటపెట్టారో తెలియదన్నారు. దెబ్బలు తిన్న వ్యక్తి బయట వచ్చి స్నేహితుడు అంటుంటే భగీరథపై పెట్టిన కేసు నిలబడుతుందా లేదా అనేది అనుమానం.