మాటలతో మాయ చేయడంలో రాజకీయ నాయకులకు పేటెంట్ ఉంటుంది. అలాంటిది.. తెలుగు రాజకీయాల్లో నలభయ్యేళ్లు దాటిన అపారమైన అనుభవశీలి చంద్రబాబునాయుడుకు ఇలా మాటలతో ప్రజలను బురిడీ కొట్టించడంలో మరింతగా ముదిరిపోయిన నాయకుడు. ఏం చెప్పినా సరే.. చాలా నమ్మకం ఆయన మాటలు చెబుతారు.. విన్నవారికి అరచేతిలో స్వర్గం చూపిస్తారు. కానీ ఆచరణకు వచ్చేసరికి అదెక్కడా నిలబడదు.
కానీ.. మళ్లీ మళ్లీ చంద్రబాబునాయుడు మాయలో జనం పడుతూనే ఉంటారు. తాజాగా తెలంగాణలో చంద్రబాబునాయుడు ఫ్లెక్సి చిత్రపటానికి నాయీబ్రాహ్మణులు అందరూ కలిసి పాలాభిషేకం చూస్తే వారి మీద జాలి కలుగుతుంది.
చంద్రబాబునాయుడు ఇటీవల ఎన్నడో.. ఒక అత్యద్భుతమైన హామీ ఇచ్చారట. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటి ఎమ్మెల్యే టికెట్ ను నాయీబ్రాహ్మణ వర్గానికి చెందిన వారికే ఇస్తానని ప్రకటించారు. ఆ ప్రకటనకు నాయీబ్రాహ్మణులు మురిసిపోయారు. ఆ మురిసిపాటుకు తెలంగాణ టీడీపీ సారథి కాసాని జ్ఞానేశ్వర్ ఇంకా చక్కెర పూత కూడా వేశారు.
తెలంగాణలో ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ కూడా నాయీబ్రాహ్మణులకు అసెంబ్లీకి వెళ్లే అవకాశమే ఇవ్వలేదని, అసెంబ్లీలో ప్రతి సామాజిక వర్గం కూడా ఉండాలనేది తెలుగుదేశం లక్ష్యం అని సెలవిచ్చారు. దీంతో.. తెలుగుదేశాన్ని తామంతా కలిసి అధికారంలోకి తీసుకువచ్చేస్తాం అని.. నాయీబ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు కూడా సెలవిచ్చేశారు.
వీరి ముచ్చట, చంద్రబాబు ప్రకటన- ఆయనకు క్షీరాభిషేకాలు ఇవన్నీ చూస్తోంటే పెద్ద కామెడీ ఎపిసోడ్ లాగా ఉంది. అసలే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శవాసనం వేసి ఉంది. కాసాని సారథ్యం స్వీకరించిన తర్వాత.. డబ్బు కుమ్మరించగల స్థితిలో ఉన్నారు గనుక.. ఖమ్మంలో ఓ బహిరంగసభ పెట్టి.. కాస్త పార్టీ బతికున్నట్టుగా హడావుడి చేశారు. ఇంకో రెండు సభలు కూడా పెడతాం అని అన్నారు గానీ ఇప్పటిదాకా చప్పుడు లేదు. ఈ పార్టీకి ఒక్క సీటు అయినా దక్కుతుందా అనేది కాదుగానీ.. ఒక్కచోట అయినా డిపాజిట్టు దక్కుతుందా అనేది కూడా సందేహమే. అలాంటి పార్టీ తరఫున తొలి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పడమూ.. ఆ వర్గం మొత్తం మురిసిపోవడమూ కామెడీ కాక మరేమిటి?
అయినా చంద్రబాబు గెలిచే అవకాశం ఉంటే.. ఏ ఒక్క మాటా ఇలా లూజ్ గా మాట్లాడరు. విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పతనం గ్యారంటీ అని ముందుగా అర్థమైంది గనకనే.. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున సీఎం అభ్యర్థిగా బీసీ సంఘాల నాయకుడు కృష్ణయ్య పేరు ప్రకటించారు. జస్ట్ బీసీ కార్డు అలా వాడుకున్నారంతే. బీసీనీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన గొప్ప పార్టీ అని చెప్పుకోడానికి మాత్రమే. అలాంటి వంచనే ఆయన ఇప్పుడు నాయీబ్రాహ్మణుల పట్ల కూడా చేశారు. పార్టీ గెలిచే పరిస్థితి ఉంటే, గెలిచే సీటు ఏదైనా ఉంటే.. అక్కడ ఈ వర్గానికి ఆయన టికెట్ ఇవ్వగలరా? అనేది వారు ఆలోచించుకోవాల్సిన విషయం.