కేసీఆర్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు తానొక మోనార్క్ గా వ్యవహారాలను నడిపిస్తుంటారు. భారత రాష్ట్ర సమితి అనేది ఉద్యమం కోసం పుట్టిన పార్టీ అయినా, ఆ పార్టీ ఈ స్థితికి రావడానికి ఎందరెందరివో త్యాగాలు ఉన్నా.. మొత్తంగా ఆ పార్టీ తన గుత్తసొత్తుగా ఆయన మార్చుకున్నారు. ఆయన మాట పార్టీలో వేదంలా చెల్లుబాటు అవుతుంది. ఆయనకు సలహాలు, గైడెన్స్ చెప్పగలవాళ్లు లేరు.
సలహాలను స్వీకరించే నాయకుడే గానీ.. ఆ సలహాలు ‘ప్రెవేటుగా’ మాత్రమే ఉండాలని కోరుకుంటారు. అలాంటి కేసీఆర్ కు బహిరంగ వేదిక మీదనుంచి.. సొంత పార్టీ నాయకుడే ఉచిత సలహాలు ఇస్తే.. పార్టీ పరిస్థితి గురించి ప్రజల్లోకి నెగటివ్ సంకేతాలు వెళ్లే కామెంట్లు చేస్తే ఆయన ఊరుకుంటారా? అలాంటి వ్యవహారాలను సహించగలరా? అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నడుస్తోంది.
పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. అయితే ఆయన వ్యాఖ్యలు గులాబీ దళపతికి గుస్సా తెప్పించవచ్చునని పలువురు అనుకుంటున్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో భారాస ఢంకా బజాయించి గెలుస్తుందని పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించారు.
బిజెపి 15-20 సీట్లకు, కాంగ్రెస్ 20-25 సీట్లకు పరిమితం అవుతాయని కూడా ఆయన జోస్యం చెప్పారు. భారాస మళ్లీ అధికారం దక్కించుకుంటుందనే చెప్పారు కదా.. ఇక కోపం ఎందుకు వస్తుంది అనుకోవచ్చు. కానీ, గులాబీ పార్టీ 80 సీట్లతో అధికారంలోకి రాగలదని అంటున్న ఎర్రబెల్లి, ప్రస్తుతం ఉన్న వారిలో 15నుంచి 20మంది ఎమ్మెల్యేలను మారిస్తే గనుక, వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తే గనుక.. పార్టీకి ఏకంగా వంద సీట్లు దక్కుతాయని అనడమే అసలు కారణం.
అంటే ఇప్పుడున్న భారాస ఎమ్మెల్యేల్లో కనీసం 20 మంది సరిగా పనిచేయడంలేదనే అభిప్రాయం ఎర్రబెల్లిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఏదో పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి, పార్టీలో స్వల్ప మార్పు చేర్పులు అవసరం అనడానికి యథాలాపంగా ఈ మాటలు అన్నారా? లేదా, సీరియస్ గా ఏదైనా సర్వే నివేదికలను లేదా క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతాన్ని గమనించి అన్నారా? అనేది చర్చనీయాంశంగా ఉంది.
ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో కనీసం 20 మంది ‘వచ్చే ఎన్నికల్లో నెగ్గడం కష్టం’ అనే స్థితిలో ఉన్నారంటే.. పార్టీ నాయకత్వం ఏం చేస్తోంది? ప్రభుత్వం ఏం చేస్తోంది? అనే ఆలోచన కూడా కలుగుతుంది. సేన చెడుగైన దండనాధుని తప్పు అని నరసింహశతకం నీతి ప్రవచించినట్టుగా ఎమ్మెల్యేలు ఏకంగా 20 మంది సరైన పనితీరు చూపించడంలేదంటే దాని అర్థం.. ముఖ్యమంత్రి పనితీరు మీద కూడా అనుమానాలు రేకెత్తిస్తుంది.
ఇలాంటి నేపథ్యంలో ఎర్రబెల్లి విశ్లేషణను కేసీఆర్ ఎలా స్వీకరిస్తారు? పాజిటివ్ గా తీసుకుని పరిస్థితిని చక్కదిద్దుతారా? లేదా, పార్టీలో అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలను బయట వేదికల మీద చెప్పినందుకు కోప్పడతారా? అనేది చూడాల్సి ఉంది.