“అమరావతి” బండారాన్ని ఈనాడు అధినేత రామోజీరావు బయటపెట్టారు. అమరావతే ఏకైక రాజధాని ఉండాలనే డిమాండ్‌తో తలపెట్టిన రెండో దశ పాదయాత్ర గత ఏడాది అక్టోబర్ 23న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. పోలీసులు అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని, పాదయాత్రకు అడ్డంకులు లేకుండా ఆదేశించాలని కోరుతూ అమరావతి జేఏసీ హైకోర్టును ఆశ్రయించడం, సానుకూల తీర్పు రావడం తెలిసిందే.
అప్పటి నుంచి పాదయాత్ర మొదలవుతుందంటూ అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు గాలి మాటలు చెబుతూ పబ్బం గడుపుకోవడం చూశాం. అయితే ఆర్థికలావాదేవీల్లో గొడవలే పాదయాత్రకు బ్రేక్ వేశాయని, ఇకపై అరసవిల్లికి అమరావతి రథం చేరదని గతంలో “గ్రేట్ ఆంధ్ర” ఆర్టికల్ రాసింది. గ్రేట్ ఆంధ్ర చెప్పిందే నిజమైంది. చివరికి పాదయాత్ర చేయడానికి ఒకే ఒక్కడు మిగిలాడు.
అమరావతి నుంచి అరసవిల్లికి చేపట్టిన రెండో విడత పాదయాత్రను పూర్తి చేయాలనే తలంపుతో అమరావతి జాయింట్ యాక్షన్ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు ఒక్కడే ముందుకు రావడం గమనార్హం. ఈ నెల 11న తిరిగి ఆయన ఒక్కడే పాదయాత్ర ప్రారంభించినట్టు టీడీపీ అనుకూల పత్రిక “ఈనాడు” రాయడం విశేషం.
అమరావతి రాజధానిపై చిత్తశుద్ధి ఏమిటో గద్దె తిరుపతిరావు చాటి చెప్పారు. అమరావతి పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందనేది కేవలం సాకు మాత్రమే అని తేలిపోయింది. హైకోర్టు నుంచి అనుమతి పొందిన వారి గుర్తింపు కార్డులు అడగడమే నేరమన్నట్టుగా నానా యాగీ చేశారు.
హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని కూడా పాదయాత్ర ఎందుకు చేయలేదో అమరావతి జేఏసీ నేతలు జనానికి సమాధానం చెప్పాల్సి వుంది. రాష్ట్ర ప్రజానీకాన్ని ఇది మోసం చేసినట్టు కాదా? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. అమరావతి ఏకైక రాజధానిగా వుండాలని కేవలం గద్దె తిరుపతిరావు మాత్రమే కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
అమరావతి నుంచి అరసవిల్లికి పాదయాత్ర ఎందుకు మొదలు పెట్టారు? రాజకీయంగా ఎవరికి నష్టం వస్తుందని నిలుపుదల చేశారో ప్రజలకు చెప్పే దమ్ము, ధైర్యం ఉన్నాయా? అని అధికార పార్టీ నేతలు నిలదీస్తున్నారు. అమరావతి రాజధాని కోసం ఇంత కాలం ఉద్యమం పేరుతో చేసిందంతా డ్రామా అని తేలిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలపరీక్షలో అమరావతి నిలువలేకపోయిందన్నది వాస్తవం.