వీర సింహా రెడ్డి సినిమా విడుదల తరువాత సినిమా మీద విమర్శల కన్నా, రచయిత బుర్రా సాయి మాధవ్ మీదే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. దానికి కారణం మరేం కాదు. సినిమాలో యాంటీ వైకాపా లేదా యాంటీ గవర్న్ మెంట్ డైలాగులు గట్టిగా వుండడమే.
డైలాగ్ రైటర్ బుర్రా కనుక సహజంగానే ఆయన మీద విమర్శలు మొదలయ్యాయి. నిజానికి నిర్మాతల మీద గట్టి ప్రెజర్ వుంటుంది. పైగా నిర్మాత అయిన నవీన్ కు వైకాపాతో కూడా మంచి సంబంధాలు వున్నాయి. పేర్ని నాని కి చాలా సన్నిహితులు. టికెట్ రేట్లు తెచ్చుకోవడంలో ఆంధ్ర సిఎమ్ జగన్ కు, మైత్రీ కి మధ్య వారధి లా పేర్ని నాని వుంటారనే టాక్ వుంది.
ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి డైలాగులు సినిమాలు ఎక్కవగా వుండడంతో ముందుగా నిర్మాతల మీద అందరి దృష్టి పడింది. అయితే తమకేమీ సంబంధం లేదని, అసలు తాము వద్దు అని చెప్పినా దర్శకుడు, రచయిత వినలేదని నిర్మాతలు వైకాపా జనాలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాత వద్దు అంటే ఆగుతుందా? హీరో, దర్శకుడు ఏది అనుకుంటే అది జరుగుతుంది తప్ప. మైత్రీ అధినేతలు కూడా ఇదే చెబుతున్నారని బొగట్టా. ఆ విధంగా నిర్మాతలు తప్పించుకుంటున్నట్లే.
రచయిత బుర్రా సాయి మాధవ్ సన్నిహితులు కూడా ఇందులో ఆయన పాత్ర చాలా లిమిట్ అని చెబుతున్నారు. బుర్రా కు ఏమీ రాజకీయ ఎజెండా, ఎఫిలియేషన్ లేదని దర్శకుడు ఎలా కావాలంటే అలా రాసి ఇవ్వడం తప్ప తన స్వంత ప్రయోజనాలు వుండవని చెబుతున్నారు. అందరూ బుర్రా కావాలని రాసారనుకుంటున్నారని, కానీ అది ఎంత మాత్రం కాదనీ, దర్శకుడు వద్దనుకుంటే డైలాగులు వుంటాయా? కావాలనుకుంటే రాయకుండా వుండడానికి వీలు అవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
హీరో బాలయ్య అయితే ఈ డైలాగులను సమర్థిస్తున్నారు. ఆంధ్రలో పరిస్థితి అలావుంది కనుకే అలాంటి డైలాగులు వున్నాయనేలా బాలయ్య మాట్లాడుతున్నారు. అంటే నిర్మాణం టైమ్ లోనే ఈ డైలాగుల మీద డిస్కషన్ జరిగి వుండాలి. ఇక ఈ లింక్ లో సమాధానం చెప్పాల్సింది దర్శకుడు గోపీచంద్ మాత్రమే. ఈ రోజు గోపీచంద్ మీడియా ముందుకు వస్తున్నారు. ఏమంటారో చూడాలి.