ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తు అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీ, జనసేన అధికారికంగా మిత్రపక్షాలు. అయితే టీడీపీతో పొత్తు కుదుర్చుకోడానికి జనసేనాని ఉబలాటపడుతున్నారు. మరోవైపు జనసేనతోనే 2024 ఎన్నికలకు వెళ్తామని బీజేపీ నేతలు నిన్నమొన్నటి వరకూ చెబుతూ వచ్చారు. తాజాగా ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలకు ఎలా వెళ్తామో 24న క్లారిటీ ఇస్తామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించడం గమనార్హం.
ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలో అధిష్టానం దిశానిర్దేశం చేసిందన్నారు. ఈ నెల 24న భీమవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీలో ఎలా వెళ్లాలో తేల్చి చెబుతామన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్ చేశారు. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటమే తమ లక్ష్యమని మరోసారి స్పష్టత ఇచ్చారు.
ఈ వ్యాఖ్య ఒక్కటీ చాలు… రానున్న ఎన్నికల్లో బీజేపీ వైఖరి ఏంటో అర్థం చేసుకోడానికి. తమను కాదని టీడీపీతో కలిసి జనసేన వెళ్లాలని నిర్ణయించుకుంటే, పట్టించుకోవద్దని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసి వెళ్లడానికి బీజేపీ అధిష్టానం సిద్ధంగా లేదని సోము వీర్రాజు వ్యాఖ్యలే నిదర్శనం. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ప్రధాని మోదీతో భేటీలోనే పవన్‌కు పొత్తులపై స్పష్టత వచ్చింది. టీడీపీతో పొత్తు కుదరదని మోదీ చెప్పడం వల్లే పవన్ ఏం మాట్లాడకుండా ఉన్నారు. ఇప్పుడాయన బీజేపీ రోడ్ మ్యాప్ గురించి ప్రస్తావించడం లేదు.
తనకు తానుగానే టీడీపీతో పొత్తును ప్రకటించారు. అయితే పవన్‌కల్యాణ్ చెప్పినట్టు డ్యాన్స్ చేయడానికి తాము సిద్ధంగా లేమని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. దాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకున్నారు. చంద్రబాబు అంటే వల్లమాలిన ప్రేమ నింపుకున్నారు. దీంతో బీజేపీ హిత వచనాలు పవన్ చెవికెక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరినీ పట్టించుకోకుండా సొంతంగా ఎదిగేందుకే బీజేపీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆ మేరకు త్వరలో తన కార్యాచరణ ప్రకటించనుంది.