తాను కూత కూస్తే తప్ప లోకం నిద్రలేవదని ఈనాడు భావిస్తున్నట్టుంది. తాను చెబితే తప్ప సమాజానికి నిజాలు తెలిసే అవకాశమే లేదని ఈనాడు భ్రమల్లో ఉన్నట్టుంది. తెలుగు సమాజ చైతన్యంపై ఈనాడుకు చాలా చులకన భావం ఉన్నట్టుంది. తెలంగాణలో నిజాల్ని పాలకుడైన కేసీఆర్ మనసును గెలుచుకోవచ్చు.
కానీ తెలంగాణ సమాజానికి తాను చేస్తున్న ద్రోహం… భవిష్య త్‌లో తగిన మూల్యం తప్పక చెల్లించాల్సి వస్తుందని ఈనాడు గ్రహించినట్టు లేదు. తెలంగాణలో ఈనాడు జర్నలిజం విలువలకు పాతరేసి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ రోజు ఈనాడు ఆంధ్రా ఎడిషనల్‌లో “అన్నదాత మృత్యుఘోష” అనే శీర్షికతో చక్కటి కథనాన్ని ప్రచురించింది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీసీ) మంగళవారం విడుదల చేసిన ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార నివేదిక -2019 ఆందో ళన కలిగిస్తోందంటూ సమగ్ర వివరాలతో ఆసక్తిదాయక కథనాన్ని ఈనాడు క్యారీ చేసిన తీరు అభినందనీయం. ఈ కథనం పాలకులకు క్షేత్రస్థాయి పరిస్థితులను కళ్లకు కట్టేలా ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఆ కథనంలోకి వెళితే…ఆంధ్రప్రదేశ్‌లో రైతులు , వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 54.96 శాతం పెరిగాయని పేర్కొంది. 2018వ సంవత్సరంలో 664 ఆత్మహత్యలు చోటు చేసుకోగా 2019లో ఆ సంఖ్య 1.029కి పెరిగింది. దేశంలోనే అత్యధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్నాటక తర్వాత మూడోస్థానంలో ఏపీ నిలిచిందని ఈనాడు రాసుకొచ్చింది. నిరుడు ఇది నాలుగో స్థానంలో ఉండడం గమనార్హమని పేర్కొంది.
అలాగే ఈ సారి కేవలం కౌలు రౌతుల ఆత్మహత్యలను పరిగణలోకి తీసుకుంటే రెండోస్థానంలో ఉందని వివరాలు వెల్లడిస్తూ ఈనాడు కథనాన్ని రాసుకెళ్లింది. సహజంగానే ఆంధ్రాలో ఇలాంటి పరిస్థితి ఉంటే…మరి మన దాయాది రాష్ట్రమైన తెలంగాణ గురించి సదరు నివేదిక ఏం చెబుతోంది? ఈనాడు ఏం రాసిందో అని కుతూహం పాఠకులకు కలుగుతోంది.
తెలంగాణలో రైతుల పరిస్థితి గురించి నివేదిక వివరాలు తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈనాడు తెలంగాణ ఎడిషన్ ఓపెన్ చేస్తే…తీవ్ర నిరాశే ఎదు రైంది. తాను వెల్లడించిన చేదు నిజాల గురించి వార్త రాసే దమ్ము, ధైర్యం ఈనాడుకు లేవనే విషయాన్ని ఎన్‌సీఆర్బీ నివేదిక స్పష్టంగా తేల్చి చెప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఈనాడు లాగు తడుపుకుంటున్న వైనం మరోమారు సదరు నివేదిక కళ్లకు కట్టింది.
ఈ నివేదిక వివరాలు వెల్లడించడంలో ఆంధ్రజ్యోతి చూపిన చొరవను తప్పక అభినందించాలి. “రైతు ఆత్మహత్యల్లో 5వ స్థానంలో తెలంగాణ!” అనే శీర్షికతో మొదటి పేజీలో ఇండికేషన్ ఇచ్చి…లోపలి పేజీలో వివరాలను క్యారీ చేసింది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ప్రకారం… రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. 2019లో 499 మంది రైతులు బలవన్మరణాలకు పాల్ప డ్డారు.
అత్యధికంగా మహారాష్ట్ర 3,927 మరణాలతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక (1,992), ఆంధ్రప్రదేశ్ (1,029), మధ్యప్రదేశ్ (541)లు ఉన్నాయి. ఆత్మహత్యల్లో జాతీయ సగటు 10.4 ఉండగా.. తెలంగాణలో అది 20.6 ఉండడం గమనార్హమని రాసుకొచ్చారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2019లో మొత్తం 7675 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అందులో 5612 మంది పురుషులు , 2062 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నట్టు తెలిపారు. 7,675 మందిలో రోజువారీ కూలీలే 2,858 మంది ఉన్నారనే నివేదిక వివరాలను వెల్లడించి ప్రజల ముందు వాస్తవాలను పెట్టారు.
ఇటీవల మీడియా పోకడలపై జనంలో విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఓ కామెంట్…సహజంగా పత్రికలు ప్రింట్ అయిన తర్వాత అమ్ముడు పోతుంటాయి. కానీ తెలుగు పత్రికలు మాత్రం అమ్ముడు పోయి ప్రింట్ అవుతుంటాయని జనం ఆవేదన నుంచి పుట్టుకొచ్చిన ఈ నిరసన వాక్యాలు ఈనాడు జర్నలిజానికి అతికినట్టు సరిపోతాయని ఎవరైనా అంటే అందుకు బాధ్యత ఎవరిది? కనీసం ఈ వార్తను తెలంగాణలో ప్రచురించలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిందా? తెలంగాణలో ఈనాడుకు ఎందుకింత ఆత్మహత్యా సదృశ్యం?