జగన్ జీ..ఇవీ రివర్స్ టెండరింగ్ చేయాల్సినవే

తప్పు ను సరిదిద్దుకోవడం అన్నది ఎప్పటికీ తప్పు కాదు. తప్పు కాకపోయినా, ఒప్పు కానిది అనుకున్నపుడు దాన్ని కూడా సరిదిద్దుకోవడం అంటే చేసింది తప్పు అని ఒప్పుకోవడం అంతకన్నా కాదు. ఇవన్నీ అలా వుంచితే,…

తప్పు ను సరిదిద్దుకోవడం అన్నది ఎప్పటికీ తప్పు కాదు. తప్పు కాకపోయినా, ఒప్పు కానిది అనుకున్నపుడు దాన్ని కూడా సరిదిద్దుకోవడం అంటే చేసింది తప్పు అని ఒప్పుకోవడం అంతకన్నా కాదు. ఇవన్నీ అలా వుంచితే, కాలు వెనక్కు తీసుకున్నంత మాత్రాన మనం ఓడిపోయారని జనం అనుకుంటారేమో అని భయపడడం అన్నది విజ్ఞత అని మాత్రం అనిపించుకోదు. విజేత కావాలనుకునేవాడు నిందకు భయపడడు. ఆత్మ విమర్శకు వెనుకాడడు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా ఆలోంచాల్సిన తరుణం వచ్చింది. ఏడాదికి పైగా ఆయన పాలనాపరమైన అనేకానేక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో మంచివి వున్నాయి, మంచివి కానివి అని అనిపించుకున్నవి వున్నాయి. కొన్ని అనివార్యంగా తీసుకున్నవి వున్నాయి. కొన్ని అత్యవసరంగా మార్చుకోవాల్సినవి వున్నాయి.

ఏడాది పాలన దాటిన సందర్భంలో వీటన్నింటి విషయంలో పునరాలోచన చేయాల్సిన తరుణం వచ్చింది. పత్రికలు, వ్యతిరేక మీడియా సంగతి పక్కన పెడితే సామాన్య ప్రజానీకం దృష్టిలో జగన్ తన ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటోంది అన్నది గమనించాల్సి వుంది. పదుగురాడు మాట పాడియై ధరజెల్లు…అన్నారు పెద్దలు.

ప్రజాస్వామ్యం అన్నది మంది స్వామ్యంగా మారుతున్న కాలం ఇది. ఇటీవలే దర్శకుడు పూరి జగన్నాధ్ ఒక మాట చెప్పారు. కనీసపు చదువు లేని వారికి ఓటు వేసే హక్కు ఇవ్వకూడదు అని. అక్కడ ఆయన ఉద్దేశం కనీసపు అవగాహన వున్నవారికే ఓటు హక్కు వుండాలని.  ఇది ఇక్కడ ఎందుకు ప్రస్తావించడం అంటే, ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గించాలి అంటే జరిమానాలు ఒకటికి వెయ్యింతలు వుండాలి అని ఓ సినిమాలో సూపర్ స్టార్ చెబితే జనం జేజేలు పలికారు. సూపర్ ఐడియా అన్నారు. కానీ అదే ఓ రాజకీయ నాయకుడు ఆచరణలో పెడితే, తరువాత ఓట్లు వేయడానికి ఆలోచిస్తారు.

జగన్ చేసింది ఇదే. మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా అమలు చేయాలనుకున్నాడు. ఆయన అందుకు చేసిన తొలిపని మద్యం దుకాణాలను సిండికేట్ల నుంచి తప్పించి, ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తరువాత మద్యం రేట్లు సామాన్యుడికి అందకుండా చేస్తే, తాగడం తగ్గిస్తారని భావించి, విపరీతంగా పెంచారు. అదేసమయంలో ప్రభుత్వ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని కొత్త బ్రాండ్లు తెచ్చారు.

ఇక్కడ జగన్ తాగుబోతులను, అంటే మరోలా భావించనక్కరలేదు. మద్యం తాగేవారిని వాడుకభాషలో అలాగే అనడం తెలుగునాట ఎప్పటి నుంచో వున్న పద ప్రయోగం. సో, ఇలా ఎడా పెడా తాగేవాళ్లను జగన్ తక్కువ అంచనా వేసారు. పెళ్లా పుస్తెలు లాక్కుని, ఇంట్లో వున్న వస్తువులను తాకట్టు పెట్టి, అందిన కాడికి అప్పు సొప్పు చేసి మరీ తాగేస్తారు చాలా మంది. రోజువారీ సంపాదనలో సగం తాగడానికే ఖర్చు చేస్తారు దినసరి కార్మికులు చాలామంది.

మరి తాగడంలో ఇలా అస్సలు విచక్షణ చూపించని  బాపతు జనాలు జగన్ ఐడియాను లేదా ముందు చూపును, లేదా ఆలోచను ఎలా పాజిటివ్ గా స్వీకరిస్తారు. వారి దృష్టిలో జగన్ మందు రేట్లు పెంచేసి దోచేసుకుంటున్నాడు. అంతే. పైగా ఇక్కడ రాజకీయం తప్ప మరోటి వుండదు. మద్యం రేట్లు పెంచి మందు బాబుల పొట్ట కొడుతున్నాడు అని కూడా రాజకీయం చేయడం అంటే ఏమనుకోవాలి. తాగేవాడికి అంటే జగన్ ఆలోచన నచ్చకపోవచ్చు. కానీ మద్యనిషేధాన్ని దృష్టిలో వుంచుకుని జగన్ చేసిన ఆలోచనను రాజకీయ నాయకులు కూడా మెచ్చకపోవడం అంటే రాజకీయం కాక మరేమిటి?

ఇలా బ్రాండ్లు, రేట్లు, ప్రభుత్వ దుకాణాలతో జగన్ అసలు ఎందుకు మాట పడాలి? కేవలం మద్యనిషేధాన్ని సాధించాలి అనే కదా? దాని కోసం ఇన్ని తంటాలు ఎందుకు? ఒక్క జివో తో మద్యనిషేధం ఇప్పుడే అమలు చేయవచ్చు కదా? నాలుగేళ్ల తరువాత అయినా జగన్ ఆశయం అదే కదా? అదేదో ఇప్పుడే చేస్తే, ఇన్ని విమర్శలు తప్పుతాయి కదా? పైగా ఇది కూడా తప్పే అంటూ ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. కోర్టు దీన్ని కూడా ఆపేసింది అనుకోండి…గొడవే లేదు.

ప్రజలకు మంచి చేయడం కోసం ప్రజల ఓట్లను దూరం చేసుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో విజ్ఞత అనిపించుకోదు. రాచరికంలో అయితే నడుస్తుంది. కానీ మళ్లీ జనం ఓట్లు సాధించి అధికారం అందుకోవాలి అనుకున్నపుడు తదనుగుణంగానే వెళ్లాలి. ఇప్పటికిప్పుడు జగన్ మద్యపాన నిషేధం విధించడం అన్నది సాధ్యమయ్యే పని కాదు. ఇటు అటు పక్క రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతుండగా , ఇక్కడ నిషేధించడం అన్నది అలవి కాని పని.

ఎంత టాస్క్ ఫోర్సలు పెట్టినా, ఎన్ని నిఘాలు పెట్టినా మద్యం అక్రమరవాణా అన్నది ఏదో మూల జరుగుతూనే వుంటుంది. ఇక అక్రమ సారా లేదా చీప్ లిక్కర్ తయారీ అన్నది గ్రామాల పొలిమేర్లలోని తోటల్లో, పొలాల్లో కుటీర పరిశ్రమగా మారిపోతుంది. ఇప్పటికే కొంత వరకు మారిపోతోంది కూడా. అధికారం వ్యవస్థ మొత్తం అత్యంత నియమ నిష్టలతో వుంటుందనీ అనుకోవడానికి లేదు.

అలాంటపుడు జగన్ చేస్తున్న ఈ ప్రయత్నం వృధాగా పోవడమే కాదు, ఆయన ఓటు బ్యాంకుకు కన్నం పెట్టే ప్రమాదం వుంది. అందువల్ల జగన్ ఏదో ఒకటే ఎంచుకోవాలి. మద్యం వుంచాలా?వద్దా? వుంచాలి అనుకుంటే జనం ఆలోచనలకు అనుగుణంగా పోవాల్సిందే. వాళ్లకు కావాల్సిన బ్రాండ్ ల ఇచ్చేయండి. రేట్లు వీలయినంత సరసంగా వుంచండి. ఎప్పుడయితే రేట్లు అందుబాటులోకి వచ్చాయో, అక్రమ మద్యం తయారీ ఆగిపోతుంది. ప్రభుత్వ ఆదాయం ఆ మేరకు సరిపోతుంది. జనం తమ ఆవేదనను జగన్ గుర్తించాడని హ్యాపీ ఫీలవుతారు.

వెనక్క తగ్గిన జగన్ అని ప్రతిపక్షం అనుకుంటే అనుకోనీండి. రివర్స్ టెండరింగ్ అన్నది మీ ఆలోచనే కదా. ఇది కూడా అలాంటిదే. సరియైనది కాదు కనుక రివర్స్ చేసుకున్నారు అని చెప్పుకొవచ్చు.

సలహాదారులు

జగన్ రివర్స్ టెండరింగ్ అదే సరిదిద్దుకోవాల్సిన మరో నిర్ణయం ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థ. తామరతంపరగా పదవులు ఇచ్చారు ప్రభుత్వ సలహాదారులు అంటూ పలువురికి. వీరంతా దాదాపు దశాబ్దకాలంగా జగన్ కు వారి వారి స్థాయిలో వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందించిన వారే. అందులో సందేహం లేదు. ఆర్థికంగా పదేళ్ల పాటు పార్టీ కోసం వారి వారి స్థాయిల్లో ఖర్చుచేసిన వారే.

ఇక్కడ కూడా నిజానికి జగన్ మంచి ఆలోచన చేసారు. కావాల్సిన వారికి, పార్టీని కష్టకాలంలో మోసిన వారికి తలా పదవి ఇచ్చి, తలా ఇంత జీతం, భత్యం ఇచ్చేసారు. ఇచ్చిన తరువాత వారికి క్లారిటీగా చెప్పేసారు. మీరు ఈ జీతం, భత్యం తీసుకుని కామ్ గా వుండండి. పైరవీలు చేస్తే మాత్రం సహించేది లేదు. అని. నిజానికి ఇక్కడ జగన్ ఆలోచన ఏమిటంటే, ఇలా చేయకపోతే, అంటే ఏ పదవి, ఏ ఆదాయం అందివ్వకపోతే, సెక్రటేరియట్ చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేసుకుంటూ గడిపేస్తారని. అదే విధంగా వారిని ఆదుకోకపోతే కృతజ్ఞత అనేది లేకపోవడం అవుతుందని.

నిజానికి తెలుగుదేశం హయాంలో కూడా ఇలా ఆదుకునే వ్యవహారం జరిగింది. కానీ ఇలా పదవులు ఇచ్చి కాదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో అనేకానేక పనులు కావాల్సిన వారికి కట్టబెట్టి. ఉదాహరణకు ఊరూరా ప్రచార కార్యక్రమాలు నిర్వహించే పని ఒకరికి ఇవ్వడం, నామినేటెడ్ ఇన్ ఫాస్ట్రక్చర్ పనులు అందించడం, అయిదేళ్లలో రెండు మూడు వందల కోట్ల ప్రకటనల ధనం అందించడం ఇలా.

కానీ ఇక్కడ ఏం జరిగింది. జగన్ అనుకున్నట్లు వాళ్లంతా పదవులు అందుకుని మౌనంగా వున్నారు. వారికి పనీ లేదు, పాటు లేదు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే వారంతా అందుకుంటున్నది ప్రభుత్వ అంటే ప్రజల ధనం. ఇది విమర్శలకు దారి తీసింది. ఇక్కడే జగన్ రివర్స్ టెండరింగ్ చేయాల్సి వుంది.

తప్పని సరిగా సలహాదారుల్లో ప్రభుత్వానికి అవసరం అనుకున్నవారిని వుంచడం, లేని వారికి పరిస్థితి వివరించి వెనక్కు పంపడం. వారంతా జగన్ అనుచరులే కాబట్టి అర్థం చేసుకోరనే సమస్య రాదు. లేదూ వారిని ఆర్థికంగా ఆదుకోవాలి అనుకుంటే తెలుగుదేశం విధానాలను ఫాలో అయిపోవడమే.

కోర్టులను అడిగి చేసే అవకాశం వుండదా?

జగన్ కు కావాల్సింది జనం గుండెల్లో సుస్థిర స్థానం. అంతే కానీ బిల్డింగ్ ల మీద పార్టీల రంగులు కాదు. నిన్న జరిగినవి కన్వీనియెంట్ గా మరిచిపోవడం మానవనైజం. పసుపు సంద్రంగా మారిన విజయవాడ లేదా విశాఖ అనే శీర్షికలు మరిచిపోయారు. ఊరులోని స్తంభాలు, భిల్డింగ్ లు అన్నింటికీ పసుపు తోరణాలు కట్టిన వైనం వదిలేసారు. అన్న క్యాంటీన్లకు పసుపు రంగు పూసింది అసలు గుర్తే లేదు. కేవలం యాగీచేయడం, కోర్టుకు వెళ్లడం. మొట్టికాయలు అంటూ మురిసిపోవడం.

ప్రతి దానికీ కోర్టుకు వెళ్లడం అన్నది తెలుగుదేశం హ్యాబీగా మారిపోయింది. ఇక ఇప్పడు జగన్ ముందు వున్నది రెండే ఆప్షన్లు. ఒకటి ఏ నిర్ణయమూ తీసుకోకుండా జనాలకు సంక్షేమ పథకాలు అందించుకుంటూ వెళ్లిపోవడం. ఎన్నికల ముందు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో వివరించడం.

లేదూ అంటే అవకాశం వుంటే, రాజ్యాంగ పరంగా ప్రావిజన్ వుంటే, న్యాయవ్యవస్థ అలా చేయడానికి అనుమతి, అలా చేయడానికి ఆ వ్యవస్థలో అవకాశం వుంటే, విశాఖలో ఇలా ఇక్కడ గెస్ట్ హవుస్ కట్టాలనుకుంటున్నా, కట్టమంటారా? వద్దా? పేదవారికి సైతం ఇంగ్లీష్ విద్య నేర్పిద్దాం అనుకుంటున్నా? ఏమైనా అవకాశం వుందా? ఎలా చేయమంటారు? రాజధాని లాంటి కీలక ప్రదేశంలో సామాన్యులకు సైతం ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నా. ఏమైనా అవకాశం వుందా? ఎలా చేయమంటారు అని ముందుగానే ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదన పంపించి అనుమతి తెచ్చుకోవడం.

ఇదంతా అయ్యేది కాదు, అలాంటి అవకాశాలు లేవు అనుకున్నపుడు, ఫస్ట్ ఆప్షన్ ను ఎంచుకుని, కేవలం సంక్షేమ ప్రభుత్వం అందిస్తూ మరో నాలుగేళ్లు కాలక్షేపం చేసేయడం, మళ్లీ అదృష్టం బాగుండి ప్రజలు ఆదరిస్తే, అప్పుడు చూసుకోవడం.

మూడు రాజధానుల విషయంలో కూడా జగన్ ఇలాంటి ముందు చూపు లేకనే ఇబ్బంది పడుతున్నారు. అసలు కార్యాలయాలు ఎందుకు తరలించే ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రిగా ఆయనకు రాష్ట్రంలో ఎక్కడయినా కూర్చుని పాలించే హక్కు వుంది. హుద్ హుద్ వచ్చినపుడు బాబగారు విశాఖ లో కూర్చుంటే ఎవరు వద్దన్నారు. కేసిఆర్ సచివాలయానికి రాకపోతే ఎవరు అడిగారు. జగన్ ఇప్పుడు నెలకు పది హేను రోజులు విశాఖలో కూర్చుంటే ఎవరు అడుగుతారు. దానిపై కూడా కోర్టుకు వెళ్తారా? జగన్ విశాఖలో కూర్చుంటే అధికారులు అంతా అక్కడికే వస్తారు. పది హేను రోజులు సిఎమ్ క్యాంప్. కాదనేది ఎవరు?

నిజానికి ఇలాంటి డొంక తిరుగుడు వ్యవహారాలు జగన్ కు చేతకావు. మొండిగా, ముక్కుసూటిగా అనుకున్నది చేసేయడం తప్ప. కానీ ముందే చెప్పుకున్నట్లు ప్రజాస్యామ్యం మందిస్వామ్యంగా మారుతున్నపుడు, ప్రతిపక్షం తమ వ్యూహాలను అమలు చేస్తున్నపుడు భగవద్గీత వల్లిస్తే సరిపోదు బాణం కూడా పట్టాల్సిందే. పాండవుల చెంత కృష్ణుడు వుండి కూడా కర్ణుడిని, భీష్ముడిని, ధుర్యోధనుడిని, ద్రోణుడిని చిట్కా ఉపాయాలతోనే చంపాల్సి వచ్చింది. ఎందుకయ్యా అంటే వాళ్లంతా దుర్మార్గులు అయినా కాకపోయినా, దుర్మార్గులతో కలిసారు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది అంటూ సర్దేశారు. జంతువును చెట్టుచాటు నుంచి చంపడం అధర్మం కాదు అని రాముడు సైతం వాలి వధను సమర్థించుకున్నారు.

అందువల్ల రాజనీతి ప్రకారం జగన్ తన ఉపాయాలు మార్చుకోవాలి. అవసరం అయితే రివర్స్ టెండరింగ్ అన్నట్లుగా నిర్ణయాలు మార్చుకోవాలి. వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నుకుంటూ పోవాలి తప్ప, ప్రతీదీ ముక్కుసూటిగా పోతాను అని చెప్పి, ముక్కకు గాయం చేసుకోవడం విజ్ఞత అనిపించుకోదు.

-చాణక్య