'ఆస్తులను కాపాడుకునేందుకే వల్లభనేని వంశీ మోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు..' ఇలా స్పందించారట నారా లోకేష్ బాబు. ఒకవైపు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ వాళ్లపై కస్సుమంటున్నారు. రాజేంద్రప్రసాద్ ను నోరు మెదపనీయకుండా మాట్లాడారు వంశీ.
ఇక చంద్రబాబు నాయుడు చేసిన దీక్షను ఇసుకపాల్జేస్తూ వల్లభనేని తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు దీక్ష మీద మీడియాలో, జనాల్లో చర్చ కన్నా వల్లభనేని వంశీ మాటల మీదే ఎక్కువగా జరిగింది. సరిగ్గా చంద్రబాబు దీక్ష చేసిన రోజున వంశీ విరుచుకుపడటంతో దీక్ష వార్తల్లో కూడా లేకుండా పోయింది.
ఇలాంటి నేపథ్యంలో వంశీ మీద లోకేష్ బాబు స్పందించారు. వంశీ ఆస్తులను కాపాడుకోవడానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టుగా చినబాబు తేల్చారు. మరి ఆ ఆస్తులను ఎప్పుడు సంపాదించుకున్నట్టు? తెలుగుదేశం హయాంలోనా? టీడీపీ హయాంలో సంపాదించుకున్న ఆస్తులను ఇప్పుడు కాపాడుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టా? లోకేష్ స్పందన అలానే ఉంది!