చిన్న టీజర్‌తోనే బజ్ తెచ్చుకున్న సినిమా పెదకాపు. కొత్త హీరో అయినా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కావడం, పలు హిట్ చిత్రాలు నిర్మించిన మిరియాల రవీందర్ రెడ్డి బ్యానర్ కావడంతో ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. ఈ సినిమాను ఓవర్ సీస్ కు కోటి పాతిక లక్షలు ఇచ్చి మరీ తీసుకున్నారు.
సరైన డేట్ కోసం చూస్తోంది ఈ సినిమా. అలాంటి టైమ్ లో ప్రభాస్-ప్రశాంత్ నీల్ సినిమా సలార్ వాయిదా పడింది. హమ్మయ్య డేట్ దొరికింది అని సంబరపడి సెప్టెంబర్ 28 విడుదల అంటూ ప్రకటించేసారు.
కానీ అక్కడే సమస్య వచ్చింది. రామ్ – బోయపాటి స్కంధ, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమాలు అదే డేట్ కు వచ్చి పడ్డాయి. వస్తుందో, రాదో తెలియదు కానీ, ఎన్టీఆర్ బావమరిది నితిన్ సినిమా మ్యాడ్ కూడా అదే డేట్ కు వుండనే వుంది.
ఇప్పుడు వీటన్నింటి మధ్య ఇరుక్కుపోయింది పెదకాపు. ఏ సినిమా సక్సెస్ అయినా విడుదల తరువాత టాక్ ను బట్టే వుంటుంది. కానీ తొలిమూడు రోజులు కాస్త కలెక్షన్లు లాగాలి అంటే మాత్రం బజ్, పోటీ ఇలా చాలా ఫ్యాక్టర్లు ఆధారపడి వుంటాయి. అటు బోయపాటి-రామ్ లాంటి పెద్ద సినిమా వుండగా, ఈ పెదకాపును పరుగెత్తుకు వచ్చి చూడాలనుకునేవారి సంఖ్య కాస్త తక్కువగానే వుంటుంది. ఇక ఇప్పుడు చేసేదేమీ లేదు. పెదకాపు ఇరుక్కుపోయింది. క్వాలిటీ టాక్ తెచ్చుకుని బయటపడడం తప్ప మరో మార్గం లేదు.