ఈ రోజుల్లో వేరు వేరు పార్టీలకు చెందిన ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకున్నా, కూర్చొని మాట్లాడుకున్నా ఏదో జరుగుతోందనే ప్రచారం వెంటనే మొదలవుతుంది. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియకపోయినా రకరకాల కథలు బయటకు వస్తాయి. వారిద్దరిలో ఎవరో ఒకరు పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుంది.
ఇప్పుడు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ వ్యవహారం కూడా ఇలాగే ఉంది. హుజూరాబాద్ లో బీజేపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ డీఎస్ ను కలుసుకున్నాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. వారేం మాట్లాడుకున్నారో స్పష్టంగా తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏమిటంటే డీఎస్ ను బీజేపీలోకి ఆహ్వానించడానికే ఈటల ఆయన్ని కలిశాడని చెబుతున్నారు.
డీఎస్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరగానే కేసీఆర్ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారు. కానీ ఆ తరువాతే కథ బెడిసి కొట్టింది. ఇద్దరి మధ్య అగాధం పెరిగింది. ఇందుకు చాలా కారణాలున్నాయి. మొత్తం మీద కేసీఆర్, డీఎస్ శత్రువులయ్యారు.
డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చినా కొన్ని కారణాల వల్ల కేసీఆర్ చర్యలు తీసుకోలేకపోయారు. తనకు తానై పార్టీ నుంచి వెళ్ళిపోకూడదని డీఎస్ అనుకున్నాడు. కొంత కాలం తరువాత డీఎస్ రాజ్యసభ సభ్యత్వం ఎలాగూ ముగుస్తుంది. టీఆర్ఎస్ లో ఆయన కథ అయిపోతుంది. ఆ తరువాత డీఎస్ తన రాజకీయ భవిష్యత్తును ఎలా నిర్ణయించుకుంటాడనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా ఉంది.
ఎందుకంటే డీఎస్ ఆషామాషీ నాయకుడు కాదు. ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగాడు. అప్పట్లో కాంగ్రెస్ లో కీలక నాయకుడు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన హయాంలోనే పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మంత్రిగా చేశాడు. ఇంతటి చరిత్ర ఉన్న డీఎస్ ను మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకురావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశాడు.
డీఎస్ ను కలిసి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి కలవడానికి ముందు డీఎస్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తప్పు చేశానని చెప్పాడు. ఆ తరువాతనే రేవంత్ వెళ్లి డీఎస్ ను కలిశాడు. దీంతో డీఎస్ కాంగ్రెస్ లో చేరబోతున్నాడనే ప్రచారం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్లో రేవంత్ రెడ్డి డీఎస్ ను కలుసుకున్నాడు.
డీఎస్ తన ఇంట్లోనే ప్రమాదానికి గురికావడంతో డాక్టర్లు ఆయనకు సర్జరీ చేశారు. దీంతో రేవంత్‌రెడ్డి ఆయన ఇంటికెళ్లి పరామర్శించాడు. పైకి చూడటానికి ఇది మామూలు పరామర్శలాగే ఉన్నప్పటికీ.. పక్కా వ్యూహంతోనే రేవంత్ ఆయన్ని కలిసినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈ సందర్భంగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా డీఎస్‌ను రేవంత్‌రెడ్డి ఆహ్వానించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్టు కథనాలు వచ్చాయి.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితులయ్యాక పార్టీని వీడిన సీనియర్ నేతలను మళ్లీ వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా డీఎస్ నివాసానికి వెళ్లిన రేవంత్ ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాడు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీఎస్, సంక్రాంతి తర్వాత తన ఎంపీ పదవికి, టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తానని చెప్పారట. దీంతో డీఎస్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడని రేవంత్ రెడ్డి ఆశలు పెట్టుకొని ఉండొచ్చు.
అయితే హుజూరాబాద్ లో గెలుపు తరువాత బీజేపీ డీఎస్ మీద కన్నేసిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈటల కూడా డీఎస్ ను కలవడంతో బీజేపీలో చేరవచ్చని అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది కాబట్టి డీఎస్ బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చని అంటున్నారు. డీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి.