ఉప ఎన్నికల కోసం ఆవురావురుమంటున్న బీజేపీ

తెలంగాణలో ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్న పార్టీ ఏదయ్యా అంటే కచ్చితంగా బీజేపీయే. తాజాగా హుజూరాబాద్ విజయంతో ఆ పార్టీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద ఆశలు పెరిగాయి. అంటే అధికారంలోకి వస్తామనే…

తెలంగాణలో ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్న పార్టీ ఏదయ్యా అంటే కచ్చితంగా బీజేపీయే. తాజాగా హుజూరాబాద్ విజయంతో ఆ పార్టీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద ఆశలు పెరిగాయి. అంటే అధికారంలోకి వస్తామనే నమ్మకం పెరిగింది. వచ్చే ఎన్నికల్లోగా తమ బలాన్ని మరింత పెంచుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. 

రాష్ట్రంలో ఇంకొన్ని ఉప ఎన్నికలు రావాలని, వాటిల్లో విజయం సాధించాలని ఆ పార్టీ అనుకుంటోంది. ఉప ఎన్నికలు ఎక్కడెక్కడ జరిగే అవకాశముందో బైనాక్యులర్స్ పెట్టుకొని చూస్తోంది. అలా చూస్తున్న కాషాయం పార్టీకి ప్రస్తుతం రెండు అసెంబ్లీ స్థానాలు కనబడుతున్నాయి. ఆ రెండు చోట్ల ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తోంది. 

ఒకవేళ ఎన్నికలు జరిగితే ఆ రెండు చోట్లా గెలవడం గ్యారంటీ అనుకుంటోంది. బీజేపీ అనుకుంటున్న రెండు స్థానాల్లో మొదటిది వేములవాడ నియోజకవర్గం. ఇక్కడి ఎమ్మెల్యే  టీఆర్ఎస్ కు చెందిన చెన్నమనేని రమేష్. ఈయన పౌరసత్వం కేసు కోర్టులో ఉంది. ఆ కేసులో తీర్పు రమేష్ కు ప్రతికూలంగా వస్తే ఆయన మీద అనర్హత వేటు పడుతుంది. కాబట్టి అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. అదే జరిగితే అక్కడ పాగా వేయాలని బీజేపీ ప్లాన్.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా గులాబీ పార్టీ ఓడిపోవడంతో తమ పార్టీని ఓడించడం కష్టమనే నమ్మకం బీజేపీ నాయకుల్లో పెరిగిపోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికతో  టీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ఆ వ్యతిరేకత తగ్గదని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. 

ఉప ఎన్నిక జరుగుతుందని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్న మరో నియోజకవర్గం మునుగోడు. నల్గొండ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉంది.

తాను బీజేపీలో చేరతానని ఇదివరకే చెప్పాడు. ఒకవేళ ఆయన బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు కాబట్టి అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇది కాకుండా నల్గొండ జిల్లాలోనే మరో రెండో మూడో స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నాడు. ఇప్పుడైతే వేములవాడ, మునుగోడు మీద ఆశలు పెట్టుకొని ఉంది కాషాయ పార్టీ.