తన తండ్రి చంద్రబాబునాయుడి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వస్తున్న కుప్పం ప్రజానీకం గౌరవాన్ని ఆయన తనయుడు లోకేశ్ పణంగా పెట్టారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల కోసం కుప్పం ఆత్మగౌరవాన్ని ఆయన తాకట్టు పెట్టారు.
రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు దేన్నైనా బలి పెడతారనే అభిప్రాయాలున్న సంగతి తెలిసిందే. తండ్రి దగ్గర రాజకీయ విద్యనభ్యసిస్తున్న లోకేశ్ అంతకంటే ఉన్నతంగా ఎలా ఆలోచిస్తారు? అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ఈ నెల 15న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబుకు సవాల్‌గా నిలిచాయి. మరోవైపు వైసీపీ అక్కడ పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల ముఖ్యనేతలు కుప్పంలో మోహరించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా కుప్పంలో నారా లోకేశ్ పర్యటించారు. శుక్రవారం అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించిన లోకేశ్ ప్రధాన ప్రత్యర్థి వైసీపీపై నిప్పులు చెరిగారు. కుప్పం ప్రజలు అమ్మకానికి సిద్ధంగా లేరన్నారు.
వైసీపీ రౌడీయిజానికి, బెదిరింపులకు భయపడేవారుకాదన్నారు. ఈ ఎన్నికలు ఇక్కడి ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినవని సెంటిమెంట్‌ను తెరపైకి తేవడం గమనార్హం. ఖచ్చితంగా వైసీపీకి కుప్పం ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారన్నారు.
గతంలో ఇలాగే గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు రాజధాని అంశాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారు. విజయవాడ, గుంటూరు నగరవాసులకు పౌరుషం లేదా అని ప్రశ్నించారు. మీకు సిగ్గు, మానం లేవని, అవే వుంటే రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తున్నా ఎందుకు స్పందించలేదని చంద్రబాబు ఈసడించుకున్న విషయం తెలిసిందే.
ఒకవేళ గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో వైసీపీకి పట్టం కడితే… మూడు రాజధానులకు ఆమోద ముద్ర వేసినట్టే అని చంద్రబాబు సెంటిమెంట్ ప్లే చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. రెండుచోట్ల వైసీపీకే జనం పట్టం కట్టారు.
అలాంటి ఎత్తుగడనే కుప్పంలో చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రదర్శించారు. కుప్పంలో విజయానికి, ఆత్మగౌరవానికి ఆయన లింక్ పెట్టారు. తమకు ఓట్లు వేస్తేనే ఆత్మగౌరవం ఉన్నట్టు లోకేశ్ చిత్రీకరించడంపై జనం మండిపడుతున్నారు.
గత 35 ఏళ్లుగా ఏకపక్షంగా గెలిపిస్తున్న ప్రజానీకాన్ని అవమానించడం కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. లోకేశ్ అర్థమవుతోందా….ఏం మాట్లాడుతున్నారో!