వల్లభనేని వంశీ కుండబద్ధలు కొట్టేశారు. ఎలాంటి మొహమాటమూ లేకుండా.. చంద్రబాబునాయుడు కొందరి ద్వారా సాగిస్తున్న బుజ్జగింపు పర్వాలకు లొంగకుండా.. తాను ఇక మీదట వైకాపా ప్రభుత్వానికి బేషరతు మద్దతు ఇస్తుంటానని ప్రకటించేశారు. ఇలాంటి ప్రకటన పర్యవసానం ఎలా ఉండబోతోంది.
తెలుగుదేశం పార్టీ ఆయన మీద స్పీకరుకు ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయిస్తుందా? లేదా, సమీకరణాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఉపేక్షిస్తుందా? అనేది వేచిచూడాలి.
వల్లభనేని వంశీ తనకు ఎంత సన్నిహితుడైనా అయిఉండొచ్చు గాక.. కానీ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఆయన పార్టీ మారుతానంటే.. వచ్చి తమతో చేరుతానంటే.. సీఎం జగన్మోహన రెడ్డి అంగీకరించే అవకాశం లేదు.
గత ప్రభుత్వంలో.. రాజీనామా చేయకుండా.. ఎమ్మెల్యేలను ఫిరాయింప జేసుకున్న తెలుగుదేశం పార్టీ దుర్మార్గాల మీద వైకాపా గట్టిగానే పోరాడింది. అదే తప్పు తాము మళ్లీ చేయకూడదనే నియమాన్ని జగన్ పాటిస్తారు.
అదే సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం ఇక ఎంతమాత్రమూ తెదేపాలో కొనసాగే ఉద్దేశంతో లేరు. ఆ పార్టీకి రాజీనామా కూడా చేసేసిన ఆయన.. చంద్రబాబు రాయబారాలను కూడా ఖాతరు చేయలేదు.
తాజాగా.. ప్రతిపక్ష నాయకుడి పాత్రను చంద్రబాబు పోషించలేక పోతున్నారంటూ విమర్శలు గుప్పించారు. లోకేష్ మీద కూడా విమర్శలు సంధించారు. జగన్మోహనరెడ్డి చేస్తున్న మంచి పనులకు అండగా ఉంటానని అన్నారు. ఎమ్మెల్యేగా కొనసాగుతానని కూడా చెప్పారు.
జగన్ మంచి పనులను కీర్తించడం అనేది వంశీకి ఇబ్బందికర వ్యాఖ్య కాకపోవచ్చు. కానీ, తెలుగుదేశం తరఫున గెలిచి.. వైకాపా ప్రభుత్వానికి బేషరతు మద్దతు ఇస్తాననే మాట సాంకేతికంగా ఇబ్బంది తెచ్చి పెడుతుంది.
తమ పార్టీకి రాజీనామా చేసిన లేఖకు, ఈ వ్యాఖ్యల క్లిపింగులను జతచేసి, తెదేపా స్పీకరుకు ఫిర్యాదు చేస్తే గనుక.. వల్లభనేని వంశీపై వేటు పడడానికి అవకాశం ఉంది.
అయితే చంద్రబాబు నాయుడు ఆయన పై ఫిర్యాదు చేయిస్తారా.. లేదా మరో వ్యూహాత్మక ఎత్తుగడ కోసం చూస్తారా అనేది తేలాలి.