కిషన్ రెడ్డి: ఇదోరకం డిక్టేటర్ షిప్!

భారతీయ జనతా పార్టీ తమ గురించి తాము సిద్ధాంతాల పార్టీ అని చాలా తరచుగా చెప్పుకుంటూ ఉండేది. ఇటీవలి కాలంలో ఆ మాట వాడడం మానేసింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడం,…

భారతీయ జనతా పార్టీ తమ గురించి తాము సిద్ధాంతాల పార్టీ అని చాలా తరచుగా చెప్పుకుంటూ ఉండేది. ఇటీవలి కాలంలో ఆ మాట వాడడం మానేసింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడం, తమకు అధికారం దక్కని రాష్ట్రాల్లో.. ఇతర పార్టీలను దారుణంగా చీల్చి.. వారిని రకరకాలుగా ప్రలోభ పెట్టి వారిని రకరకాలుగా లోబరచుకుని తాము అధికారంలోకి రావడానికి ప్రయత్నించడం వంటి పనులు పెరిగిన తర్వాత.. తమది సిద్ధాంతాల పార్టీ అని చెప్పుకోవడం మానేసింది. 

అయితే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. మరో అడుగు ముందుకు వేసి.. తమది నియంతృత్వాన్ని నమ్మే పార్టీ అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా తన వ్యవహార సరళికి ఆయన క్రమశిక్షణ అనే ముసుగు వేసుకోవచ్చు గాక.. కానీ ఆయన పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

భారాస ఆల్రెడీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది. కాంగ్రెస్ నేడో రేపో  ప్రకటించడానికి వడపోతను ఒక కొలిక్కి తెస్తోంది. ఈ సమయంలో  ఇంకా ఇతర పార్టీల నుంచి నాయకులు తమ చెంతకు తరలివస్తారని ఆశిస్తూ కూర్చున్న బిజెపి.. తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం దరఖాస్తుల స్వీకరణ ను ప్రారంభించింది. ఈనెల పదోతేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వారిలోంచి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న సుమారు 25 స్థానాల వరకు తొలి జాబితాను ప్రకటించేస్తారని.. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి.. ఒక్కో చోటకు ముగ్గురేసి వంతున పేర్లతో హైకమాండ్ కు తమ సిఫారసులను పంపుతారని తెలుస్తోంది.

అయితే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా.. పార్టీ కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. ఆశావహులకు విధించిన ఆంక్షలే చిత్రంగా కనిపిస్తున్నాయి. దరఖాస్తులు సమర్పించిన వారు మీడియాతో మాట్లాడకుండా పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని, వెళ్లి తమ తమ నియోజకవర్గాల్లో పనిచేయడం ప్రారంభించాలని కిషన్ రెడ్డి ఆర్డర్ పాస్ చేశారు. 

ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు మీడియాతో మాట్లాడడంలో ఆయనకు అభ్యంతరం ఏమిటో ఎవ్వరికీ అర్థం కాని సంగతి. ఆశావహులు మీడియాతో మాట్లాడితేనే పార్టీ పరువు పోతుందరని కిషన్ రెడ్డి భయపడుతున్నారో ఏమో తెలియడం లేదు. 

అభ్యర్థుల నోటికి తాళాలు వేసే ఇంతటి నియంతృత్వ పోకడలు మరే ఇతర పార్టీలోనూ ఉండవని ఆ పార్టీ వారే విమర్శిస్తున్నారు. చూడబోతే.. వ్యక్తి కేంద్రంగా నడిచే భారాసలో కూడా.. ఇంతటి నియంతృత్వం లేదు. టికెట్లు కోరుకుంటున్న వారు యథేచ్ఛగా తమ అభిప్రాయాలు బయటకు చెబుతూనే ఉన్నారు., అసమ్మతి చాటుతూనే ఉన్నారు.. పార్టీ వారితో మాట్లాడుతూనే ఉంది. వ్యవహారాలు నడుస్తున్నాయి. కానీ కిషన్ రెడ్డి మాత్రం.. తమ భారతీయ జనతా పార్టీని.. డెమోక్రాసీలో నియంతృత్వానికి చిరునామాగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు.